Saraswati Anthya Pushkaralu: దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం.. ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పవిత్ర సరస్వతీ నది అంత్య పుష్కరాలు ఈరోజు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం తెల్లవారుజామున 5 గంటల 43 నిమిషాలకు.. కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు తొలి పుష్కర స్నానాన్ని ఆచరించి ఈ వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ పుణ్య ఘడియల్లో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు, కొండా సురేఖలతో పాటు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ పవిత్ర స్నానాలు ఆచరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

12 రోజుల ఆధ్యాత్మిక పండుగ

నేటి నుండి జూన్ 1వ తేదీ వరకు.. అంటే 12 రోజుల పాటు ఈ అంత్య పుష్కరాలు కొనసాగనున్నాయి. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణిగా ప్రవహించే సరస్వతీ నదుల త్రివేణి సంగమ క్షేత్రంలో.. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి తమ పితృదేవతలకు తర్పణాలు వదులుతున్నారు. స్నానానంతరం భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండి శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.

భక్తుల కోసం భారీ ఏర్పాట్లు

పుష్కరాల కోసం లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. స్నాన ఘట్టాల వద్ద బారికేడ్లు, తాగునీరు, నిరంతర పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. ఈ 12 రోజుల పాటు కాళేశ్వర క్షేత్రం వేద మంత్రోచ్ఛారణలు, ఆధ్యాత్మిక వెలుగులతో విరాజిల్లబోతోంది.పుణ్యప్రదమైన ఈ సరస్వతీ అంత్య పుష్కరాల్లో పాల్గొని, ఆ ముక్తీశ్వరుని కృపకు పాత్రులు కావాలని భక్తులు భారీగా తరలివస్తున్నారు.

Tags: