Saree Presented to Goddess Padmavathi: శ్రీవారి ఆలయం నుండి శ్రీ పద్మావతి అమ్మవారికి సారె...
శ్రీ పద్మావతి అమ్మవారికి సారె...
Saree Presented to Goddess Padmavathi: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం నాడు పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారె ను ఊరేగింపుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి తీసుకెళ్లారు..
ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి సారె తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ముందుగా శ్రీవారి ఆలయంలో ఉదయం 2.30 నుండి పరిమళాన్ని(నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన మిశ్రమం) విమాన ప్రాకారంలో ఊరేగింపు చేపట్టారు..
ఉదయం 4.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణంతో కూడిన సారె ఊరేగింపు మొదలైంది. సారెను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు..
అనంతరం సారెను అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. అనంతరం కాలినడకన తిరుమల నుంచి తిరుపతిలోని అలిపిరి వద్దకు తీసుకెళ్లారు.. అక్కడినుండి కోమలమ్మ సత్రం, శ్రీ కోదండరామాలయం, శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, లక్ష్మీపురం సర్కిల్, శిల్పారామం నుండి తిరుచానూరు పసుపు మండపం మీదుగా ఆలయం వద్ద అమ్మవారికి సారె సమర్పించారు. ఆభరణంతో కూడిన శ్రీవారి సారెను అలిపిరి వద్ద అదనపు ఈవో వెంకయ్య చౌదరి జేఈవో వీరబ్రహ్మంకు అందజేశారు.