Shravana Month 2026: హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రంగా, దైవిక మాసంగా భావించే 'శ్రావణ మాసం' వచ్చేసింది. ఏడాది పొడవునా వచ్చే పండగలు, నోములలో శ్రావణ మాసానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ మాసం మొత్తం శివకేశవులకు, అష్టలక్ష్మి స్వరూపిణి అయిన మహాలక్ష్మి అమ్మవారికీ అత్యంత ప్రీతికరమైనదిగా భక్తులు విశ్వసిస్తారు.

చాంద్రమానం ప్రకారం ఐదవ నెల అయిన శ్రావణంలో ప్రతి రోజూ పవిత్రమైనదే. ఈ మాసంలో వచ్చే ప్రతివారం ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుంది.

సోమవారాలు: పరమశివునికి అత్యంత ప్రీతికరమైన శ్రావణ సోమవారాల్లో శివలింగానికి రుద్రాభిషేకం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు.

మంగళవారాలు: వివాహితలు సౌభాగ్యం కోసం 'మంగళ గౌరీ వ్రతం' ఆచరిస్తారు.

శుక్రవారం: అష్టలక్ష్మి కటాక్షం కోసం ఇళ్లలో అత్యంత భక్తిశ్రద్ధలతో 'వరలక్ష్మి వ్రతం' జరుపుకుంటారు.

ఇక శనివారం రోజున శ్రీవేంకటేశ్వర స్వామిని పూజించడం ఆనవాయితీ. ఈ మాసంలోనే వచ్చే నాగుల పంచమి, రాఖీ పౌర్ణమి, శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి పండుగలు ఈ మాసపు శోభను మరింత పెంచుతాయి.

శ్రావణ మాసంలో చేసే ఏ చిన్న పూజ లేదా దానధర్మమైనా అనంతమైన పుణ్యఫలాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ నెలంతా భక్తులు నియమ నిష్ఠలతో, సాత్విక ఆహారంతో గడుపుతూ దైవారాధనలో లీనమవుతారు.

Tags: