Sri Govindaraja Swamy Temple: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెలలో గోకులాష్టమి, ఉట్లోత్సవాలు, ఉత్తర నక్షత్రం, పత్రోత్సవాలు, పౌర్ణమి సందర్భంగా గరుడ సేవ వంటి కార్యక్రమాలు జరగనున్నాయి.సెప్టెంబరు 4న గోకులాష్టమి సందర్భంగా సాయంత్రం శ్రీ కృష్ణ స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం బంగారు వాకిలి చెంత పురాణ ప్రవచనం, గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు.

సెప్టెంబరు 7న చిన్న వీధి ఉట్లోత్సవం నిర్వహించనున్నారు. అలాగే సెప్టెంబరు 8న పెద్ద వీధి ఉట్లోత్సవం జరగనుంది.సెప్టెంబరు 12న ఉత్తర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ఉభయ నాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

సెప్టెంబరు 21న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పత్రోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు. సెప్టెంబరు 22 నుంచి 24వ తేదీ వరకు పత్రోత్సవాలు కొనసాగనున్నాయి. సెప్టెంబరు 26న పౌర్ణమి సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామివారి గరుడ సేవను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది.

Tags: