Spirituality: ఆధ్యాత్మికం: ఏ దేవుడికి ఏ పండు నైవేద్యం పెడితే ఎలాంటి ఫలితం ఉంటుంది?
ఏ పండు నైవేద్యం పెడితే ఎలాంటి ఫలితం ఉంటుంది?
Spirituality: హిందూ ధర్మంలో దేవుడిని దర్శించుకునేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్లకూడదని పెద్దలు చెబుతుంటారు. అందుకే భక్తులు తమ శక్తి కొద్దీ పండ్లు, పూలు లేదా కొబ్బరికాయలను తీసుకెళ్తుంటారు. అయితే, మనం సమర్పించే ఒక్కో పండుకు ఒక్కో విశిష్టత ఉంటుందని, నిర్దిష్ట ఫలితాలను ఇస్తుందని ప్రముఖ జ్యోతిష్కులు వివరించారు.
నైవేద్యంగా సమర్పించే పండ్లు - వాటి ఫలితాల పూర్తి వివరాలు మీకోసం:
అరటిపండు
అరటిపండును గురువులకు అత్యంత ఇష్టమైన పండుగా పరిగణిస్తారు. మీరు ప్రారంభించిన పనులు మధ్యలో ఆగిపోయినా లేదా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నా, దేవునికి అరటిపండు సమర్పించడం వల్ల ఆటంకాలు తొలగి పనులు పూర్తవుతాయి. ఇది పని పట్ల ఆసక్తిని కూడా పెంచుతుంది.
కొబ్బరికాయ
కొబ్బరికాయను అర్పించడం అంటే మనలోని 'అహాన్ని' దేవుడి ముందు వదిలేయడం అని అర్థం. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే వారు కొబ్బరికాయ సమర్పిస్తే స్పష్టమైన ఆలోచనలు వస్తాయి. ఇది ఉద్యోగం, వ్యాపారంలో పురోగతిని, ఉన్నతాధికారుల మద్దతును తెచ్చిపెడుతుంది.
ఆపిల్
ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఆపిల్ పండును నైవేద్యంగా పెడితే ఉపశమనం లభిస్తుందని నమ్మకం. ఇది పేదరికాన్ని దూరం చేయడంతో పాటు, ఇతరులకు ఇచ్చిన బాకీ ఉన్న అప్పులను తిరిగి వసూలు చేసుకోవడంలో సహాయపడుతుంది.
మామిడి పండు
సొంతిల్లు కట్టుకోవాలని లేదా స్థలం కొనాలని కలలు కనేవారికి మామిడి పండు నైవేద్యం శుభప్రదం. ఇది అప్పుల బాధల నుండి విముక్తి కలిగిస్తుంది. ముఖ్యంగా భారీ మొత్తంలో ఉన్న రుణాలను ఒకేసారి తీర్చివేసే అదృష్టాన్ని కలిగిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
ద్రాక్ష
తాజా ద్రాక్ష లేదా ఎండు ద్రాక్షలను సమర్పించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మనస్సులో మంచి ఆలోచనలు కలగడానికి, కుటుంబంలో ఆనందం వెల్లివిరియడానికి ద్రాక్ష నైవేద్యం ఉత్తమం.
సపోటా
వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి సపోటా పండు శుభ ఫలితాలను ఇస్తుంది. ఇది శత్రువుల అణిచివేతకు, బంధాల మధ్య స్థిరత్వానికి తోడ్పడుతుంది.
నేరేడు పండు
నేరేడు పండు శని దేవుడికి ప్రీతిపాత్రమైనది. ఏల్నాటి శని, అర్ధాష్టమ శని వంటి శని దోషాలతో బాధపడేవారు ఈ పండును నైవేద్యంగా సమర్పించడం వల్ల ఉపశమనం పొందుతారు. కోర్టు కేసులు, పేదరికం నుండి బయటపడవచ్చు.
డ్రై ఫ్రూట్స్
జీడిపప్పు, బాదం వంటి డ్రై ఫ్రూట్స్ సమర్పించడం వల్ల దేవుని కృప త్వరగా లభిస్తుందని, బంధుమిత్రులతో సంబంధాలు బలపడతాయని నమ్ముతారు.