Sri Kalyana Venkateswara Swamy: నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శుక్రవారం రాత్రి అనంత తేజోమూర్తి అయిన శ్రీనివాసుడు సరస్వతీ దేవి అలంకారంలో హంసవాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి స్వామివారు గ్రామ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. జ్ఞానానికి ప్రతీకమైన హంసవాహనంపై విరాజిల్లిన కల్యాణ శ్రీనివాసుడు భక్తుల హృదయాలను భక్తి పరవశంలో ముంచెత్తారు. పురాణాల ప్రకారం హంస వివేకానికి, పరమజ్ఞానానికి చిహ్నంగా భావించబడుతుంది. భక్తులలో అహంకారాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తిని కలిగించేందుకే స్వామివారు హంసవాహనాన్ని అధిరోహిస్తారని ఆధ్యాత్మిక వేత్తలు పేర్కొంటున్నారు. మరోవైపు హైదరాబాద్ కు చెందిన ఇందు డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ శ్రీ తలశిల వేంకటేశ్వరరావు శుక్రవారం తిరుపతిలోని టీటీడీ సెంట్రల్ ఆసుపత్రికి రూ.7.50 లక్షల విలువైన ఔషధాలను విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తరఫున టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళాన్ని అందజేశారు. ఇక గుంటూరుకు చెందిన డాక్టర్ అన్నం శ్రీనివాస్ శుక్రవారం టీటీడీకి చెందిన శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.15,00,116 విరాళంగా అందించారు.

Tags: