Sri Kalyana Venkateswara Swamy’s Pavitrotsavam Concludes with Purnahuti: పూర్ణాహుతితో ముగిసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి పవిత్రోత్సవాలు
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి పవిత్రోత్సవాలు
Sri Kalyana Venkateswara Swamy’s Pavitrotsavam Concludes with Purnahuti: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు ఆదివారం పూర్ణాహుతితో ముగిశాయి.ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాల, కొలువు నిర్వహించారు. యాగశాల వైదిక కార్యక్రమాల అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఆ తరువాత యాగశాల వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి నిర్వహించారు. అదేవిధంగా కుంభప్రోక్షణ, ఆచార్య బహుమానం అందజేశారు. ఈ కార్యక్రమంతో పవిత్రోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, సూపరింటెండెంట్ రమేష్ బాబు, ఆర్జితం ఇన్స్పెక్టర్ ధనశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.