Sri Kalyana Venkateswara Swamy: నవంబరు 5 నుండి 7వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు
పవిత్రోత్సవాలు
Sri Kalyana Venkateswara Swamy: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 5 నుండి 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను టీటీడీ వైభవంగా నిర్వహించనుంది.
ఈ ఉత్సవాలకు నవంబరు 4వ తేదీ సాయంత్రం 6 గంటలకు మత్స్యగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ కార్యక్రమాలతో శాస్త్రోక్తంగా శ్రీకారం చుట్టనున్నారు. అదే రోజు ఉదయం 9.30 గంటలకు ఆచార్య రుత్విక్వరణం నిర్వహిస్తారు.
పవిత్రోత్సవాల విశేష కార్యక్రమాలు
మొదటిరోజైన నవంబరు 5న ఉదయం 8.30 గంటలకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించి, రాత్రి 7 గంటలకు పవిత్ర ప్రతిష్ఠ చేపడతారు.
రెండో రోజైన నవంబరు 6న మధ్యాహ్నం 12 గంటలకు పవిత్ర సమర్పణ నిర్వహిస్తారు.
చివరిరోజైన నవంబరు 7న రాత్రి 8.30 గంటలకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి.
స్నపన తిరుమంజనం, వీధి ఉత్సవం
ఉత్సవాల్లో భాగంగా నవంబరు 5, 7 తేదీల్లో ఉదయం 11 గంటలకు, నవంబరు 6న ఉదయం 10 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు.
నవంబరు 6న సాయంత్రం 5 గంటలకు స్వామివారు, అమ్మవార్ల వీధి ఉత్సవం వైభవంగా నిర్వహిస్తారు.
ఆలయ పవిత్రత పరిరక్షణే పవిత్రోత్సవాల ఉద్దేశం
ఆలయంలో తెలియక జరిగే దోషాల నివారణకు, ఆలయ పవిత్రతను కాపాడేందుకు ప్రతి సంవత్సరం పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి సందర్భాల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. భక్తులు, సిబ్బంది తెలియక చేసే పొరపాట్ల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా వేదపఠనం, ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం తదితర వైదిక కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహిస్తారు.