Sri Krishna Ashtami 2026: శ్రీకృష్ణాష్టమి 2026: పూజా ముహూర్తం, నిశిత కాల విశిష్టత - ఉపవాస నియమాలు..
ఉపవాస నియమాలు..
Sri Krishna Ashtami 2026: హిందూ సంప్రదాయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పర్వదినాలలో శ్రీకృష్ణాష్టమి ఒకటి. లోక రక్షణ కోసం శ్రీమహావిష్ణువు ఎత్తిన ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకుని భక్తులు జన్మాష్టమిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. 2026లో శ్రీకృష్ణాష్టమి పండుగను సెప్టెంబర్ 4, శుక్రవారం నాడు జరుపుకోనున్నారు.
తిథి - పూజా ముహూర్తాల వివరాలు
పంచాంగ గణనాల ప్రకారం.. ఈ ఏడాది కృష్ణాష్టమికి సంబంధించిన కీలక సమయాలు:
అష్టమి తిథి ప్రారంభం: సెప్టెంబర్ 4, మధ్యాహ్నం 02:25 గంటలకు
అష్టమి తిథి సమాప్తి: సెప్టెంబర్ 5, అర్ధరాత్రి 12:13 గంటలకు
రోహిణి నక్షత్రం: సెప్టెంబర్ 4 అర్ధరాత్రి 12:29 గంటలకు ప్రారంభమై, అదే రోజు రాత్రి 11:04 గంటలకు ముగుస్తుంది.
నిశిత కాల పూజా ముహూర్తం: సెప్టెంబర్ 5 రాత్రి 11:57 గంటల నుండి అర్ధరాత్రి 12:42 గంటల వరకు (మొత్తం 45 నిమిషాలు).
ఉపవాస విరమణ సమయం: సెప్టెంబర్ 5న ఉదయం 06:01 గంటల తర్వాత.
అర్ధరాత్రి పూజకు గల ప్రత్యేక ప్రాముఖ్యత
చాలా హిందూ పండుగలలో పగటిపూట పూజలు చేస్తుంటారు. కానీ జన్మాష్టమి నాడు అర్ధరాత్రి పూజకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు అర్ధరాత్రి వేళ, నిశిత కాలంలో జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగా భక్తులు రోజంతా ఉపవాసం ఉండి, కృష్ణుని జన్మ ఘడియలైన నిశిత కాలం (రాత్రి 11:57 నుండి 12:42 వరకు) కోసం వేచి చూస్తూ భజనలు, సంకీర్తనలతో గడుపుతారు.
పూజా విధానాలు మరియు ఆచారాలు
షోడశోపచార పూజ: శ్రీకృష్ణుని విగ్రహాన్ని సుగంధ ద్రవ్యాలు, పూలతో సుందరంగా అలంకరించి షోడశోపచారాలతో విశేష పూజలు నిర్వహిస్తారు.
నైవేద్యం: కన్నయ్యకు ప్రీతిపాత్రమైన వెన్న, పాలు, పండ్లు, పిండివంటలతో కూడిన 16 రకాల నైవేద్యాలను సమర్పిస్తారు.
డోలోత్సవం: అర్ధరాత్రి పూజా సమయంలో బాలకృష్ణుడిని చిన్న ఉయ్యాలలో ఉంచి జోలపాటలు, భజనలతో ఊపడం ప్రధాన ఆచారం.
బాలగోపాల వేషధారణలు: చిన్నపిల్లలను చిన్నికృష్ణుడు, రాధల వేషధారణలతో ముస్తాబు చేసి సంబరాల్లో పాల్గొంటారు.
జన్మాష్టమి ఉపవాస నియమాలు
జన్మాష్టమికి ముందు రోజు ఒకే పూట భోజనం చేయడం ఆనవాయితీ.
పండుగ రోజు ఉదయాన్నే పవిత్ర స్నానం ఆచరించి, సంకల్పం చెప్పుకుని ఉపవాసాన్ని ప్రారంభిస్తారు.
ఉపవాస సమయంలో ధాన్యాలతో చేసిన ఆహారాన్ని తీసుకోకుండా కేవలం పాలు, పండ్లను మాత్రమే స్వీకరిస్తారు.
మరుసటి రోజు (సెప్టెంబర్ 5) సూర్యోదయం తర్వాత తిథి, నక్షత్రాలను అనుసరించి పారణ చేసి ఉపవాసాన్ని విరమిస్తారు.