Mohini Avatar at Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడై భక్తులకు జగన్మోహనాకారంలో దర్శనమిచ్చారు. మరో తిరుచ్చిపై శ్రీకృష్ణస్వామివారు అలంకృతులై భక్తులకు అభయమిచ్చారు.

గజరాజులు ముందు నడుస్తుండగా, భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి పల్లకీసేవ వైభవంగా సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ శ్రీవారిని దర్శించుకుని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.

మోహినీ అవతారం.. మాయామోహాల నుంచి విముక్తికి సందేశం

మోహినీ అవతారం జగత్తును ఆవహించిన మాయామోహాలకు అతీతంగా భగవంతుని తత్త్వాన్ని గ్రహించాలనే ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తుంది. సమస్త జగత్తు భగవంతుని లీలా విలాసమని, ఆయన అనుగ్రహంతోనే మాయామోహాలను అధిగమించి ఆధ్యాత్మిక ఉన్నతిని పొందగలమనే తత్త్వాన్ని ఈ అవతారం చాటిచెబుతుంది.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, శ్రీమతి జానకీ దేవి, శ్రీమతి రంగశ్రీ, శ్రీ ఆనంద సాయి, శ్రీ దర్శన్, శ్రీ నరేష్ కుమార్, శ్రీ ఎన్. సదాశివరావు, జేఈవోలు డా. ఎ. శరత్, శ్రీ ప్రభల గోపీనాథ్, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags: