Sri Padmavathi Ammavari Pavitrotsavams: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజులుగా భక్తిశ్రద్ధలతో నిర్వహించిన అమ్మవారి పవిత్రోత్సవాలు శనివారం వైభవంగా ముగిశాయి. చివరి రోజు నిర్వహించిన మహాపూర్ణాహుతి, శాంతి హోమం, కుంభప్రోక్షణ తదితర కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పవిత్రోత్సవాల ముగింపు సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 10.40 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మహాపూర్ణాహుతి, శాంతి హోమం, కుంభప్రోక్షణ, నివేదన కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.

భక్తిశ్రద్ధలతో చక్రస్నానం

మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో స్నపనతిరుమంజనం నిర్వహించారు. శ్రీ పద్మావతి అమ్మవారితో పాటు శ్రీకృష్ణస్వామివారు, శ్రీసుందరరాజస్వామివారు, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌కు ప్రత్యేకంగా అభిషేకాది కార్యక్రమాలు చేపట్టారు.

అనంతరం శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌ను పల్లకీలో మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా పద్మపుష్కరిణి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

మాడ వీధుల్లో స్వామి, అమ్మవారి విహారం

పవిత్రోత్సవాల ముగింపు సందర్భంగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీకృష్ణస్వామివారు, శ్రీసుందరరాజస్వామివారు, శ్రీ పద్మావతి అమ్మవారు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలతో తిరుచానూరు ఆలయం భక్తి, ఆధ్యాత్మికతతో కళకళలాడింది. ఉత్సవాల చివరి రోజు కూడా అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం మొత్తం ఆధ్యాత్మిక శోభతో ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, జేఈవో డా. ఎ. శరత్, సీవీఎస్వో శ్రీ కే.వి. మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్లు శ్రీ మునిచెంగల్రాయలు, శ్రీ రమేష్, శ్రీ సురేష్, శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ చలపతి, శ్రీ లక్ష్మీకాంతం, ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

Tags: