TTD Warns: భక్తుల సేవలకు ఆటంకం కల్గిస్తే కఠిన చర్యలు.. హెచ్చరించిన టీటీడీ
హెచ్చరించిన టీటీడీ;
TTD Warns: శ్రీవారి భక్తులకు సేవలు అందించే కాంట్రాక్ట్ ఉద్యోగులు విధులను బహిష్కరించి నిరసనలకు దిగితే చర్యలు తప్పవని టిటిడి పేర్కొంది. కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ న్యాయమైన కోరికలను సదరు శాఖాధిపతులతో చర్చించి పరిష్కరించుకోవాలని కోరింది. న్యాయమైన కోర్కెలను తీర్చడానికి యాజమాన్యం సదా సంసిద్ధంగా ఉందని పేర్కొంది. పారిశుధ్ద్యం, ఆరోగ్యం తదితర శాఖలలో సంబంధిత కాంట్రాక్ట్ ఉద్యోగులు విశేషంగా సేవలు అందిస్తున్నారని, భక్తులకు ఇబ్బందులకు గురిచేసే చర్యలు తీసుకోవద్దని కోరింది. భక్తుల సేవలకు ఉద్యోగులు ఆటంకం కల్గించే చర్యలను నిషేధించే ముఖ్యమైన సేవల నిర్వహణ చట్టం ( ఎస్మా) టిటిడిలో అమలులో ఉందని, సదరు నిబంధనలను ఉద్యోగులు గుర్తు చేసుకోవాలని టిటిడి పేర్కొంది.
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఆధ్యాత్మిక సంస్థలో విధులను బహిష్కరించడం సరికాదని సూచించింది. నిబంధనలను ఉల్లంఘించి సమ్మెబాట పడితే ఎస్మా చట్టాన్ని అమలు చేస్తామన్నారు. ఎస్.ఎల్.ఎస్.ఎం.పీ.సీ సంస్థతోపాటు కాంట్రాక్ట్, పలు సొసైటీలలో ఉద్యోగులు పనిచేస్తున్నారని, సదరు ఉద్యోగులు విధులను బహిష్కరిస్తే ఎస్మా చట్టం ప్రకారం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని పేర్కొంది. గతంలో టిటిడిలో విధులను బహిష్కరణ చేసినా మానవతా దృక్పథంతో తిరిగి విధుల్లోకి తీసుకోవడం జరిగింది. ఈసారి విధుల నుండి తొలగించాక విధులను బహిష్కరించిన వారిని ఎలాంటి పరిస్థితుల్లో తిరిగి చేర్చుకోరని టిటిడి తెలిపింది.
టిటిడిలో భక్తులకు సేవలు అందించే ఉద్యోగులు ధర్నాలు చేయడం, నిరసన నోటీసులు ఇవ్వడం, ఊరేగింపులు చేయడం చట్టప్రకారం నిషేధం. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా, ఉద్యోగుల విధులకు టిటిడితో సంబంధం లేని బయట వ్యక్తులు ఆటంకం కల్గిస్తే చట్టపరమైన క్రిమినల్ చర్యలకు వెనుకాడమని హెచ్చరించింది.