Pindi Deepa Aradhana: భక్తుల అంతరంగాల్లో యోగజ్యోతి వెలిగించడమే పిండి దీపారాధన లక్ష్యం
పిండి దీపారాధన లక్ష్యం
Pindi Deepa Aradhana: పవిత్ర పెరటాసి మాసం మూడవ శనివారం సందర్భంగా భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించి, వారి అంతరంగాల్లో భక్తి, జ్ఞాన జ్యోతులను వెలిగించడమే పిండి దీపోత్సవ లక్ష్యమని టీటీడీ జేఈవో (విద్యా, ఆరోగ్యం) శ్రీ ప్రభల గోపీనాథ్ తెలిపారు.
టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్టు, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీబీసీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం టీటీడీ పరిపాలనా భవనం పరేడ్ మైదానం నుంచి అలిపిరి పాదాల మండపం వరకు పిండి దీపోత్సవ శోభాయాత్ర మంగళవాయిద్యాలు, గోవింద నామస్మరణల నడుమ భక్తిశ్రద్ధలతో వైభవంగా సాగింది.
మనసును పిండిగా.. జ్ఞానాన్ని జ్యోతిగా వెలిగించాలి
పిండి దీపారాధనతో సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయనే విశ్వాసం భక్తుల్లో ఉందని జేఈవో తెలిపారు. టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డాక్టర్ మేడసాని మోహన్ మాట్లాడుతూ, భక్తులు తమ మనసును పిండిగా, జ్ఞానాన్ని జ్యోతిగా భావించి భగవంతుని ఆరాధించాలని సూచించారు. కురవ నంబి, తొండమాన్ చక్రవర్తి పిండి దీపంతో శ్రీవారిని ఆరాధించిన విశేషాలను వివరించారు.
శాస్త్రోక్తంగా పూజలు
శోభాయాత్రకు ముందు టీటీడీ పరిపాలనా భవనం ప్రాంగణంలో అర్చకులు పిండి దీపానికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దీపాన్ని అలిపిరి పాదాల మండపానికి తీసుకువెళ్లి ప్రతిష్ఠించి పూజలు చేశారు.