The Sacred Pilgrimage: కాకిని హంసగా మార్చిన పుణ్య క్షేత్రం

పుణ్య క్షేత్రం

Update: 2026-01-22 11:22 GMT

The Sacred Pilgrimage: కృష్ణా నదీ సాగర సంగమ తీరాన ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్న పుణ్యక్షేత్రం హంసలదీవి. ఇక్కడ కొలువైన వేణుగోపాలస్వామి ఆలయం అద్భుతమైన చరిత్రకు, పురాణ గాథలకు నిలయం. ఈ ఆలయానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది. పూర్వం దేవతలు ఏకాంతంగా స్వామివారిని పూజించేందుకు ఈ ఆలయాన్ని కేవలం ఒక్క రాత్రిలోనే నిర్మించారని భక్తుల నమ్మకం. అయితే, నిర్మాణం పూర్తికాకముందే తెల్లవారడంతో ఈ ఆలయ రాజగోపురం నేటికీ అసంపూర్తిగానే దర్శనమిస్తుంది. ఈ క్షేత్రానికి 'హంసలదీవి' అనే పేరు రావడం వెనుక కూడా ఒక మహిమాన్వితమైన విశిష్టత ఉంది. ఒకప్పుడు గంగానది కాకి రూపంలో వచ్చి ఇక్కడి పవిత్ర సంగమ తీరాన స్నానమాచరించి, హంసలా స్వచ్ఛంగా మారిందని చరిత్ర చెబుతోంది. పాపాలను హరించి మనసును హంసలా నిర్మలంగా మార్చే శక్తి ఈ క్షేత్రానికి ఉందని భక్తుల విశ్వాసం. నీలమేఘ ఛాయతో వెలిగిపోతున్న వేణుగోపాలస్వామి వారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వేల సంఖ్యలో తరలివస్తుంటారు. ప్రస్తుతం ఈ ఆలయంలో మాఘ మాస బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి కళ్యాణోత్సవం, వాహన సేవలు భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతున్నాయి. కృష్ణా నది సముద్రంలో కలిసే ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షిస్తూ, స్వామివారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని భక్తులు భావిస్తారు. ఈ ఉత్సవాల నేపథ్యంలో ఆలయ ప్రాంగణం భక్తజన సంద్రంగా మారింది.

Tags:    

Similar News