Seven Immortals: ఎప్పటికీ మరణం లేని ఏడుగురు సప్త చిరంజీవులు
ఏడుగురు సప్త చిరంజీవులు
Seven Immortals: హిందూ పురాణాలలో, "చిరంజీవి" అంటే శాశ్వతంగా లేదా చాలా కాలం జీవించేవారు అని అర్థం. ఈ భూమిపై యుగాంతం వరకు మరణం లేకుండా జీవించే వరం లేదా శాపం పొందిన ఏడుగురు పౌరాణిక పురుషులను సప్త చిరంజీవులుగా వ్యవహరిస్తారు. వీరు ఇప్పటికీ భూమిపై జీవించి ఉన్నారని, కలియుగాంతంలో శ్రీమహావిష్ణువు కల్కి అవతారానికి సహాయపడతారని ప్రగాఢమైన విశ్వాసం.
1. అశ్వత్థామ : మహాభారతంలో ద్రోణాచార్యుని కుమారుడు. చిరంజీవిగా మారడానికి కారణం కురుక్షేత్ర యుద్ధం తర్వాత చేసిన దురాగతాల (నిద్రిస్తున్న ఉపపాండవులను చంపడం) కారణంగా, శ్రీకృష్ణుడు అతన్ని శపించాడు. నుదిటిపై ఉన్న మణిని తీసివేసి, శరీరంపై పుండ్లు, కురుపులతో యుగాంతం వరకు బాధపడుతూ ఒంటరిగా జీవించమని శపించాడు.
2. బలి చక్రవర్తి : ప్రహ్లాదుని మనుమడు, మహాదాత, దానవ చక్రవర్తి. చిరంజీవిగా మారడానికి కారణం దానగుణం, సత్యసంధత. వామనావతారంలో వచ్చిన విష్ణుమూర్తికి మూడడుగుల నేల దానం చేసి, తన తలను సమర్పించుకున్నాడు. అతని సత్యానికి మెచ్చి విష్ణువు చిరంజీవత్వాన్ని ఇచ్చి, పాతాళ లోకానికి రాజుగా చేశాడు.
3. వ్యాస మహర్షి (వేదవ్యాసుడు) : చిరంజీవిగా మారడానికి కారణం లోకకల్యాణం, జ్ఞాన సముపార్జన. వేదాలను విభజించి, వేదవ్యాసుడుగా పేరు పొందారు. మహాభారతం, అష్టాదశ పురాణాలను రచించిన ఈ మహర్షికి జ్ఞానానికి ప్రతీకగా చిరంజీవత్వం లభించింది.
4. హనుమంతుడు : శ్రీరాముని పరమ భక్తుడు, పవనసుతుడు. చిరంజీవిగా మారడానికి కారణం అచంచలమైన భక్తి, నిస్వార్థ సేవ. శ్రీరామునిపై ఉన్న అపారమైన ప్రేమ, సేవలకు మెచ్చి, భూమిపై రామనామం ఉన్నంత వరకు జీవించి ఉండాలని శ్రీరాముడు చిరంజీవత్వాన్ని అనుగ్రహించాడు.
5. విభీషణుడు : చిరంజీవిగా మారడానికి కారణం ధర్మనిష్ఠ. ధర్మం వైపు నిలబడి శ్రీరామునికి సహాయం చేసినందుకు, శ్రీరాముడు అతనికి లంకాధిపత్యంతో పాటు చిరంజీవత్వాన్ని ప్రసాదించాడు.
6. కృపాచార్యుడు : కౌరవ పాండవులకు గురువు. చిరంజీవిగా మారడానికి కారణం.. గురుత్వం, నిస్వార్థ గుణం. తన జ్ఞాన బోధన, ధర్మబద్ధమైన జీవితం కారణంగా చిరంజీవత్వం లభించింది. మహాభారత యుద్ధం తర్వాత జీవించి ఉన్న అతి కొద్దిమంది యోధులలో ఇతను ఒకరు.
7. పరశురాముడు : శ్రీ మహావిష్ణువు ఆరవ అవతారం. చిరంజీవిగా మారడానికి కారణం తపోశక్తి. గొప్ప యోధుడు, శివ ధనుర్విద్యలో నిపుణుడు. ఆయన ఉత్కృష్టమైన తపోశక్తి కారణంగా చిరంజీవిగా మిగిలి, ప్రస్తుతానికి మహేంద్ర పర్వతంపై తపస్సు చేసుకుంటూ ఉంటాడని నమ్మకం.