18 Sacred Steps of Sabarimala: శబరిమల 18 మెట్ల వెనుక ఉన్న పరమార్థం ఇదే.
పరమార్థం ఇదే.
18 Sacred Steps of Sabarimala: స్వామియే శరణం అయ్యప్ప! కలియుగ ప్రత్యక్ష దైవం మణికంఠుడిని దర్శించుకోవాలంటే.. ఆ పదునెట్టాంబడిని ఎక్కాల్సిందే. కానీ, ఆ 18 మెట్లు కేవలం రాతి కట్టడాలు కావు.. అవి మనిషి మోక్ష మార్గంలో అధిరోహించాల్సిన ఆధ్యాత్మిక సోపానాలు. ఈ మెట్ల వెనుక ఉన్న అద్భుతమైన అంతరార్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటి 5 మెట్లు - పంచేంద్రియాల విజయం
మొదటి ఐదు మెట్లు మన శరీరంలోని పంచేంద్రియాలను సూచిస్తాయి. అంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. మనిషి ప్రాపంచిక సుఖాల వైపు వెళ్లకుండా ఉండాలంటే.. ముందుగా ఈ ఐదు ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. ఈ ఇంద్రియాలపై విజయం సాధించినప్పుడే, భగవంతుడి వైపు వెళ్లే ప్రయాణం మొదలవుతుంది.
తర్వాతి 8 మెట్లు - రాగద్వేషాల పరిత్యాగం
ఆ తర్వాత వచ్చే ఎనిమిది మెట్లు మనిషిలోని అంతర్గత శత్రువులకు ప్రతీకలు. కామం, కోపం, మోహం, లోభం, మదం, మాత్సర్యం.. వీటితో పాటు ఈర్ష్య,ద్వేషం. ఈ ఎనిమిది దుర్గుణాలు మన మనస్సును కలుషితం చేస్తాయి. ఈ రాగద్వేషాలను, అహంకారాన్ని ఆ మెట్ల వద్దే వదిలేసి, స్వచ్ఛమైన మనస్సుతో ముందుకు సాగాలనేది ఇందులోని పరమార్థం.
తర్వాతి 3 మెట్లు - త్రిగుణాల ప్రతీక
పదహారో మెట్టు వరకు చేరుకున్న భక్తుడు.. ఇప్పుడు సత్వ, రజో, తమో అనే త్రిగుణాలను ఎదుర్కోవాలి. బద్ధకానికి నిదర్శనమైన తమో గుణాన్ని, ఆవేశానికి ప్రతీకైన రజో గుణాన్ని వీడి.. ప్రశాంతతను ఇచ్చే సత్వ గుణాన్ని అలవర్చుకోవాలని ఈ మూడు మెట్లు మనకు దిశానిర్దేశం చేస్తాయి.
చివరి 2 మెట్లు - జ్ఞానోదయం
ఇక ఆఖరి రెండు మెట్లు విద్య ,అవిద్యలకు ప్రతీకలు. అవిద్య అంటే అజ్ఞానం.. దీనిని పూర్తిగా తొలగించుకుని, విద్య అంటే నిజమైన ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడే.. మనిషి పరిపూర్ణుడవుతాడు. ఈ 18 మెట్లు అధిరోహించిన భక్తుడు.. చివరకు 'తత్వమసి' అనే పరమ సత్యాన్ని దర్శిస్తాడు. అంటే నీలో ఉన్నది భగవంతుడే అని గుర్తిస్తాడు.