Ganapati Visarjan: గణేశోత్సవ వేడుకలకు వేడుకగా ముగింపు పలికే అద్భుతమైన ఘట్టమే... గణేష్ నిమజ్జనం! పది రోజుల పాటు భక్తుల ఇంటింటా, ప్రత్యేక పందిళ్లలో కొలువైన విఘ్నేశుడికి కంటతడితో, మళ్లీ త్వరగా రావాలని కోరుకుంటూ కన్నీటి వీడ్కోలు పలికే భావోద్వేగభరితమైన క్షణం ఇది.అయితే, ఈ నిమజ్జన సంప్రదాయం వెనుక ఎంతటి గొప్ప ఆధ్యాత్మిక అర్ధముందో మీకు తెలుసా?

హిందూ సనాతన ధర్మం ప్రకారం... మనం పూజించే భౌతిక రూపం తాత్కాలికం. సృష్టిలోని ప్రతి వస్తువు పంచభూతాల నుంచి ఉద్భవించి, మళ్లీ చివరికి వాటిలోనే లీనమైపోవాలనే సత్యానికి ఈ నిమజ్జనం ఒక ప్రతీక. పది రోజుల పాటు మన అతిథిగా వచ్చి, మన కష్టసుఖాలను పంచుకున్న దేవుడిని... ఎంతో ప్రేమతో తిరిగి ఆయన దివ్యధామానికి సాగనంపడమే ఈ ఆచారం ఉద్దేశం.

చరిత్ర పరంగా చూస్తే, ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలంలో ఈ వేడుకలను బహిరంగంగా, ప్రజలందరూ కలిసి ఐక్యంగా జరుపుకునేలా ఒక సాంస్కృతిక వేడుకగా తీర్చిదిద్దారు. నాటి నుంచి నేటి వరకు ఈ సంప్రదాయం మన సంస్కృతిలో భాగమైంది.

నిమజ్జన రోజున భక్తుల ఉత్సాహం మాటల్లో చెప్పలేనిది! 'గణపతి బప్పా మోరియా.. అనే మార్మోగే నినాదాలతో, డప్పు చప్పుళ్లతో వీధులన్నీ మారుమోగిపోతాయి. భక్తులు తమ దైవానికి ఘనంగా వీడ్కోలు పలుకుతారు.

అయితే కాలం మారుతున్న కొద్దీ, మన సంప్రదాయంతో పాటు ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా పెరిగింది. నేడు పర్యావరణానికి హాని చేయని మట్టి విగ్రహాలను (Eco-friendly Idols) వాడడం, నీటి వనరులు కలుషితం కాకుండా కృత్రిమ కొలనులలో నిమజ్జనం చేయడం ద్వారా మన బాధ్యతను చాటుకుంటున్నాం.

భౌతిక రూపం కరిగిపోయినా... విఘ్నేశుడి దీవెనలు, ఆయన నేర్పిన విజ్ఞత ఎప్పటికీ మన గుండెల్లోనే నిలిచిపోతాయి. ఈ గణేష్ నిమజ్జనం మనకు నేర్పే సత్యం ఒక్కటే... రావడం, ఆనందాన్ని పంచడం, అందరితో కలిసిపోవడం, ఎప్పటికీ చెరగని జ్ఞాపకాలను మిగిల్చి వెళ్లడం!

Tags: