Sri Swami Pushkarini Teertham: శ్రీ మహా విష్ణు పాదోద్భవమై, బ్రహ్మకరస్పర్శతో పవిత్రమై సనకసనందనాది యోగులచే కొనియాడబడినది ఈ స్వామి పుష్కరిణి తీర్థం.

దక్షిణభారతదేశానికి మకుటాయమానం తిరుమల క్షేత్రం. అత్యంత పావనము సర్వకామదాయకాలైన అరవై ఆరు కోట్ల తీర్థాలు తిరుమలక్షేత్రంలో ఉన్నాయని బ్రహ్మపురాణం మనకు తెలియజేస్తోంది.

వీటిల్లో తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తరం వైపున స్వామిపుష్కరిణి అనే మహత్తర తీర్థం ఉంది.

ఇది వైకుంఠం నుంచి గరుడునిచే తీసుకురాబడిన క్రీడాపర్వతంలో శ్రీభూదేవులకు క్రీడా సరస్సుగా ఉన్నట్టు పురాణాల్లో చెప్పబడింది. ఈ తీర్థ ప్రస్తావన వరాహ, పద్మ, మార్కండేయ, వామన, స్కాంద, బ్రహ్మ, భవిష్యోత్తర పురాణాలలో కన్పిస్తుంది.

వేంకటా చలంలో ఉన్న తీర్థాలకు ఈ పుష్కరిణి అవతార స్థానంగా పేర్కొనబడింది.

స్వామి పుష్కరిణి ఒకటిన్నర ఎకరాల విస్తీర్ణంలో ఉంది. విజయనగర రాజు సాలువ నరసింహరాయలు పుష్కరిణి మధ్యలో నీరాళీ మండపం నిర్మించారు. ఆ త‌రువాత శ్రీ‌వారి భ‌క్తాగ్రేస‌రుడు శ్రీ తాళ్ల‌పాక అన్న‌మ‌య్య ఆ మండ‌పం అభివృద్ధికి చ‌ర్య‌లు తీసుకున్నారు.

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల స‌మ‌యంలో ప్ర‌తిరోజూ ఉద‌యం, రాత్రి వాహ‌న‌సేవ‌ల్లో పుష్క‌రిణి వ‌ద్ద హార‌తి ఇస్తారు. మిగ‌తా స‌మ‌యంలో ప్ర‌తిరోజూ సాయంత్రం స‌హ‌స్ర‌దీపాలంకార సేవ అనంత‌రం పుష్క‌రిణి హార‌తి ఇస్తారు. పుష్క‌రిణి హార‌తి, పూజ గురించి 12 శ‌తాబ్దం నాటి శాస‌నాల్లోనూ పొందుప‌రిచారు.

విజ‌య‌న‌గ‌ర సామ్రాజ్యాధినేత శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ‌ల కాలం నుంచి పుష్క‌రిణి హార‌తిని కొన‌సాగించిన‌ట్టు తెలుస్తోంది. 1972వ సంవ‌త్స‌రంలో శ్రీ‌వారి పుష్క‌రిణిలో ఫిల్ట‌ర్ల‌తోపాటు కాలువ‌ల‌ను ఏర్పాటుచేశారు. త‌ర‌చుగా పుష్క‌రిణి నీటిని తొల‌గించి తాజా నీటితో నింపుతారు.

కాగా స్వామి పుష్కరిణి తీర్థం సమస్త తీర్థాల సంగమంగా పేర్కొనబడింది.

ఈశాన్యం: గాలవతీర్థం; తూర్పు: మార్కండేయ తీర్థం; ఆగ్నేయం: ఆగ్నేయతీర్థం; ఉత్తరం: ధనదతీర్థం, సరస్వతీతీర్థం; దక్షిణం: యామ్య తీర్థం; వాయవ్యం: వాయుతీర్థం; పశ్చిమం: వారుణతీర్థం; నైరుతి: వసిష్ఠతీర్థం. మొదలగు అమోఘమైన తీర్థరాజాలతో స్వామిపుష్కరిణి విలసిల్లుతోంది.

శ్రీమన్నారాయణుని పాదపద్మాలనుండి ప్రవహిస్తున్న స్వామి పుష్కరిణీ ప్రభావం వర్ణనాతీతం. దీన్నే విరజానది అని కూడా అంటారు. ఇది గంగాది సర్వతీర్థాలకు జన్మస్థానం. దీని దర్శనం, స్పర్శనం, స్మరణం కూడా సర్వాభీష్టాలను అనుగ్రహిస్తుంది. మార్గశిర శుద్ధద్వాదశినాడు ఆరుణోదయ వేళలో కోట్లాది తీర్థాలు స్వామి పుష్కరిణిలో ప్రవేశిస్తాయి. తద్వారా పాపాలన్నీ నశించిపోతాయని వరాహ, వామన పురాణాలు తెలియజేస్తున్నాయి.

స్నానమహిమ :

స్వామిపుష్కరిణిలో స్నానం సర్వాభీష్ట ఫలప్రదం. ఎవరు ఏ కోరికతో ఇందులో స్నానం చేస్తేవారికి ఆ కోరిక త్వరలో సిద్ధిస్తుంది. పుష్కరిణి స్నానం సర్వపాప నిర్మూలకమని తారకవధ చేసిన కార్తికేయుడి వృత్తాంతం వల్ల తెలుస్తుంది.

స్వామిపుష్కరిణిలో స్నానం చేసిన వారి వారి అభీష్టాలను పొందిన భక్తులను గురించి వరాహ, భవిష్యోత్తర, స్కాంద పురాణాలు మనకు వివరిస్తున్నాయి.

శ్రీరామవృత్తాంతం : శ్రీరాముడు వానరసైన్యంతో వేంకటాద్రికి వెళ్లి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి దాని ప్రభావం చేతనే రావణాది రాక్షసుల్ని జయించి సీతాదేవిని తిరిగి పొందినట్లు భవిష్యోత్తరపురాణం తెలియజేస్తోంది.

స్కాందపురాణం : స్కాందపురాణం, స్వామి పుష్కరిణి ప్రభావాన్ని నిరూపించడానికి ఎన్నో వృత్తాంతాల్ని తెలియజేస్తున్నది. మానవుడు మూడుసార్లు స్వామి పుష్కరిణిని స్మరిస్తూ ఏ తీర్థంలో స్నానం ఆచరించినా బహు పుణ్యప్రదమని ఈ పురాణం వివరిస్తున్నది.

Tags: