Pooja Room: పూజ గదిలో ఉండకూడని దేవుళ్ల ఫోటోలు ఇవే
దేవుళ్ల ఫోటోలు ఇవే
Pooja Room: పూజ గదిలో ఉగ్రరూపంలో ఉన్న విగ్రహాలు, చిత్రపటాలు ఉండకూడదు. ఉదాహరణకు.. కాళికాదేవి, మహిషాసుర మర్దిని వంటి రౌద్ర రూపాలు గృహస్థులకు మంచిది కావని శాస్త్రం చెబుతోంది. అలాగే మరణించిన పితృదేవతల ఫొటోలను పూజ గదిలో దేవుడి పటాల మధ్య ఉంచకూడదు. వాటిని దక్షిణ దిశలో వేరుగా ఉంచాలి. ప్రశాంతమైన, ఆశీర్వదించే భంగిమలో ఉన్న దైవ చిత్రాలను మాత్రమే పూజకు ఉపయోగించాలి. దీని వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని పండితులు చెబుతారు.
ఇంట్లో దేవుడి చిత్రపటాలు, విగ్రహాలను శుభ్రం చేయడానికి గురువారం శుభప్రదమైన రోజని పండితులు సూచిస్తున్నారు. శుక్రవారం, మంగళవారాల్లో వాటిని కదపకూడదని హెచ్చరిస్తున్నారు. ‘ప్రతి వారం వీలుపడకపోతే అమావాస్య రోజున శుభ్రం చేయాలి. అమావాస్య శుక్రవారం వస్తే గురువారమే శుద్ధి చేసుకోవాలి’ అని చెబుతున్నారు.
పూజ గదిలో చిత్రపటాలను ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశ ముఖంగా ఉండేలా చూసుకోవాలి. అంటే మనం పూజ చేసేటప్పుడు తూర్పు వైపునకు తిరిగి ఉండాలి. లక్ష్మీదేవి, గణపతి, సరస్వతి పటాలను కలిపి ఉంచడం శుభకరం. పగిలిన లేదా చినిగిపోయిన పటాలను పూజ గదిలో అస్సలు ఉంచకూడదు. పటాలకు ప్రతిరోజు గంధం, కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. అలాగే ప్రశాంతత లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
అష్టైశ్వర్యాలు సిద్ధించాలంటే పూజా గదిలో కూర్చున్న స్థితిలో ఉన్న లక్ష్మీదేవి, ఎడమ వైపునకు తొండం ఉన్న వినాయకుడి విగ్రహాలను ఉంచాలి. లక్ష్మీదేవి ఎప్పుడూ నిలబడి ఉన్నట్లు ఉండకూడదు. అది చంచలత్వానికి సంకేతం. గణపతి విగ్రహం ఇంట్లోని వాస్తు దోషాలను తొలగిస్తుంది. ప్రతి గురువారం ఈ విగ్రహాలకు పసుపు, కుంకుమలతో పూజ చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి, ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని పండితులు చెబుతుంటారు.