Tirumala Tirupati Devasthanams (TTD): తిరుమల వెళ్తున్నారా? జూలై - సెప్టెంబర్ మధ్య ఆ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు బంద్!

వీఐపీ బ్రేక్ దర్శనాలు బంద్!

Update: 2026-07-09 04:37 GMT

Tirumala Tirupati Devasthanams (TTD): తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ప్లాన్ చేసుకుంటున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒక ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ 30 వరకు తిరుమల ఆలయంలో జరిగే వివిధ పండుగలు, ప్రత్యేక ఉత్సవాల కారణంగా కొన్ని నిర్దిష్టమైన రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఈ నిర్ణయం ప్రకారం... జూలై 14న జరిగే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జూలై 17న నిర్వహించే ఆణివార ఆస్థానం, అలాగే జూలై 19న శ్రీ ఆండవన్ ఆశ్రమ స్వామీజీ పెద్ద మర్యాద సందర్భంగా బ్రేక్ దర్శనాలు ఉండవు. వీటితో పాటు జూలై 29న జీయర్ స్వాముల చాతుర్మాస సంకల్పం రోజున, ఆగస్టు 22న పవిత్రోత్సవాల అంకురార్పణ, ఆగస్టు 24న పవిత్రోత్సవాల రెండో రోజు పవిత్రాల సమర్పణ రోజుల్లో కూడా ఈ రద్దు వర్తిస్తుంది.

ఇక సెప్టెంబర్ నెల విషయానికి వస్తే... శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సెప్టెంబర్ 8న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, సెప్టెంబర్ 14న బ్రహ్మోత్సవాల అంకురార్పణ రోజుల్లో బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. ముఖ్యంగా సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాల రోజుల్లో పూర్తిగా వీఐపీ బ్రేక్ దర్శనాలు అందుబాటులో ఉండవు.

పైన పేర్కొన్న తేదీలకు సంబంధించి ముందు రోజు తిరుమలలో కేవలం ప్రోటోకాల్ ప్రముఖులకు (మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వంటి అధికారిక హోదాలో ఉన్నవారికి) మాత్రమే దర్శన సదుపాయం ఉంటుంది. సామాన్య భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి వీఐపీ సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది. కాబట్టి తిరుమల ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునే భక్తులందరూ ఈ మార్పులను గమనించి, దానికి తగినట్లుగా తమ టికెట్లను, ప్రయాణాన్ని సిద్ధం చేసుకోవాలని అధికారులు కోరారు.

Tags:    

Similar News