Lord Venkateswara’s Brahmotsavams: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతి నగరం భక్తి, ఆధ్యాత్మికత, వైభవంతో వెలుగొందేలా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి జేఈవో డా. ఎ. శరత్ అధికారులను ఆదేశించారు. టిటిడి అధికారులతో కలిసి గురువారం రేణిగుంట విమానాశ్రయం నుండి గరుడ సర్కిల్ వరకు ఆయన పర్యటించి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, ఈ నెల 15 నుండి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుపతికి తరలిరానున్న నేపథ్యంలో, తిరుపతి నగరానికి అడుగుపెట్టిన ప్రతి భక్తుడికి శ్రీవారి బ్రహ్మోత్సవాల దివ్య వైభవం ప్రస్ఫుటంగా కనిపించేలా నగర పరిసరాలను తీర్చిదిద్దాలని ఆయన సూచించారు.

రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతి నగరానికి చేరుకునే మార్గంతో పాటు, నగరాన్ని నాలుగు వైపుల నుంచి కలిపే ప్రధాన కూడళ్లన్నీ శ్రీవారి భక్తి పరిమళాలు వెదజల్లేలా, ఆధ్యాత్మిక శోభతో అలరారేలా ఏర్పాట్లు చేయాలన్నారు.

గత బ్రహ్మోత్సవాల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ఈసారి మరింత ఆకర్షణీయంగా, సృజనాత్మకంగా విద్యుత్ అలంకరణలు, హోర్డింగులు, ఫ్లెక్సీలు, పుష్పాలంకరణలు చేపట్టాలని ఆదేశించారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల వైభవాన్ని ప్రతిబింబించేలా అలంకరణల్లో భక్తి, సంప్రదాయం, సౌందర్యం ఉట్టిపడేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

తిరుపతి నగరానికి ప్రత్యేక ఆధ్యాత్మిక గుర్తింపుగా నిలిచే గరుడ విగ్రహాన్ని మరింత వైభవోపేతంగా విద్యుత్ అలంకరణలతో తీర్చిదిద్ది, భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా చేయాలని సూచించారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుపతి ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచేలా, తిరుమలలో జరిగే ప్రతి ఉత్సవ ఘట్టం తిరుపతి నగరంలోనూ భక్తులకు అనుభూతి కలిగించే విధంగా పండుగ వాతావరణం నెలకొల్పాలని ఆయన స్పష్టం చేశారు.

బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, భక్తుల హృదయాల్లో భక్తిభావాన్ని నింపేలా, తిరుపతి నగరమంతా శ్రీవారి నామస్మరణతో, వెలుగుల అలంకరణలతో, పుష్ప సోయగాలతో కళకళలాడేలా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో సీఈ శ్రీ మనోహరం, ఎస్ఈ శ్రీ వేంకటేశ్వర్లు, అడిషనల్ హెల్త్ ఆఫీసర్ డా. సునీల్, విజీవో శ్రీ గిరిధర, ఈఈలు శ్రీ రవిశంకర్ రెడ్డి, శ్రీమతి సరస్వతి తదితర అధికారులు పాల్గొన్నారు.

Tags: