Today is Mohini Ekadashi: ఇవాళ మోహినీ ఏకాదశి.. ఈ పవిత్ర రోజున పాటించాల్సిన నియమాలు
ఈ పవిత్ర రోజున పాటించాల్సిన నియమాలు
Today is Mohini Ekadashi: హిందూ ధర్మంలో ఏకాదశి తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వాటన్నింటిలో అత్యంత ఫలప్రదమైనది ‘మోహినీ ఏకాదశి’. ఈ రోజున శ్రీమహావిష్ణువు మోహినీ రూపంలో అవతరించారు. ఇవాళమోహినీ ఏకాదశి.. ఈ పవిత్ర రోజున లక్ష్మీనారాయణులను భక్తితో కొలిస్తే ఇంట్లో సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
మోహినీ ఏకాదశి నాడు తొలిసారి వ్రతం చేసేవారు కొన్ని నియమాలను తప్పక పాటించాలి. ముందుగా ఈ రోజు తెల్లవారుజామునే స్నానమాచరించి, విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైన పసుపు రంగు దుస్తులను ధరించాలి. పూజా గదిని శుభ్రం చేసి గంగాజలంతో ప్రోక్షించాలి. ఒక పీటపై ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాన్ని పరిచి, శ్రీమహావిష్ణువు , లక్ష్మీదేవి విగ్రహాలను లేదా చిత్రపటాలను ప్రతిష్టించాలి.
స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి, పసుపు వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించాలి. గంధపు తిలకం దిద్ది, పసుపు రంగు పుష్పాలు, తులసి దళాలను సమర్పించాలి. లక్ష్మీదేవికి కుంకుమ, పువ్వులు, సౌభాగ్య ద్రవ్యాలను సమర్పించాలి. ఆ తర్వాత నెయ్యితో దీపారాధన చేసి, ధూపం వేయాలి. మోహినీ ఏకాదశి వ్రత కథను చదువుకుని, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది.
పూజ సమయంలో "ఓం నమో భగవతే వాసుదేవాయ" లక్ష్మీదేవి మంత్రాలను జపించాలి. నైవేద్యంలో తప్పనిసరిగా తులసి దళం ఉండేలా చూసుకోవాలి.
ముహూర్త సమయాలు: ఏకాదశి తిథి ఏప్రిల్ 26 సాయంత్రం 6:06 గంటలకు ప్రారంభమై, ఏప్రిల్ 27 సాయంత్రం 6:15 గంటలకు ముగుస్తుంది. బ్రాహ్మ ముహూర్తం ఉదయం 4:43 నుండి 5:28 వరకు ఉంటుంది. పూజకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:11 నుండి 1:02 వరకు అనుకూలం.