Trayodashi Nandi Puja: హిందూ మత సంప్రదాయంలో శివునికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో, ఆయన వాహనమైన నందీశ్వరునికి కూడా అంతటి విశిష్ట స్థానం ఉంది. నందిని కేవలం పరమశివుని వాహనంగానే కాకుండా అత్యంత ప్రియమైన భక్తునిగా మరియు రుద్రరూపంగా పూజిస్తారు. ముఖ్యంగా త్రయోదశి తిథి, ప్రదోష కాలంలో శివునితో పాటు నందీశ్వరుడిని ఆరాధించడం అత్యంత శుభప్రదమని భక్తుల నమ్మకం. ఆర్ద్ర నక్షత్రంతో కూడిన త్రయోదశి తిథి నాడు చేసే నందీశ్వర పూజ విశేష ఫలితాలను ఇస్తుందని, పాపాలను తొలగించి కుటుంబానికి శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. త్రయోదశి నాడు నందీశ్వరుడిని పూజించడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు మరియు పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

కుటుంబ సమస్యలు, మనస్పర్థలకు చెక్

కుటుంబంలో తరచుగా కలహాలు, అశాంతి లేదా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారు త్రయోదశి నాడు శివాలయానికి వెళ్లాడు. అక్కడ ప్రశాంతంగా కూర్చుని శివ నందీశ్వరులను దర్శించుకుని భక్తితో ప్రార్థించడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. శివాలయంలో చేసే ప్రార్థన మనశ్శాంతిని ఇవ్వడమే కాకుండా, ఇంట్లో అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది.

వివాహ యోగం – ఆటంకాల నివారణ

చాలాకాలంగా పెళ్లి సంబంధాలు కుదరక, వివాహంలో పదేపదే ఆటంకాలు ఎదుర్కొంటున్న వారికి త్రయోదశి నందీశ్వర పూజ ఒక గొప్ప పరిహారంగా పనిచేస్తుంది. నందీశ్వరునితో పాటు శివ-పార్వతులను జంటగా పూజించడం వల్ల జాతకంలో ఉండే వివాహ దోషాలు తొలగిపోతాయి. త్వరలోనే వివాహం నిశ్చయమై, మంచి వైవాహిక జీవితం లభిస్తుందని నమ్ముతారు.

ఆరోగ్య ప్రాప్తి - దీర్ఘాయువు

శివునికి ప్రీతిపాత్రమైన పదార్థాలతో అభిషేకం చేయడం వల్ల సకల రోగాలు నశించి ఆరోగ్యం ప్రప్తిస్తుందని నమ్ముతారు. త్రయోదశి రోజున శివలింగానికి నీరు, పాలు, పెరుగు, తేనె వంటి పదార్థాలతో రుద్రాభిషేకం చేయడం వల్ల శారీరక, మానసిక రుగ్మతలు తొలగిపోయి దీర్ఘాయువు లభిస్తుంది.

త్రయోదశి నాడు నందీశ్వరుడిని ఎలా పూజించాలి?

ఉదయకాల శుద్ధి: త్రయోదశి రోజున ఉదయమే తలస్నానం చేసి శుచిగా తెల్లటి లేదా సాంప్రదాయ దుస్తులు ధరించాలి.

నందీశ్వర దర్శనం: శివాలయానికి వెళ్లిన తర్వాత ముందుగా నందీశ్వరునికి నమస్కరించి, ప్రార్థన చేసుకోవాలి.

చెవిలో కోరికలు చెప్పడం: నందీశ్వరుని కొమ్ముల మధ్య నుండి శివలింగాన్ని దర్శించుకోవడం, నంది చెవిలో తమ మనసులోని కోరికలను చెప్పుకోవడం అత్యంత పవిత్రంగా భావిస్తారు.

బిల్వపత్ర సమర్పణ: ఆ తర్వాత శివలింగానికి ఏకబిల్వం లేదా త్రిదళ బిల్వపత్రాలను సమర్పించాలి.

మంత్ర జపం: ఆలయంలో కూర్చుని కనీసం 108 సార్లు ఓం నమః శివాయ మహా మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో జపించాలి.

ప్రదోష కాల పూజ: సాయంత్రం సూర్యాస్తమయ సమయానికి ముందు ఉండే ప్రదోష కాలంలో శివాలయంలో దీపారాధన చేసి, శివుడిని పూజించడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి.

Tags: