TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఆణివార ఆస్థానం
తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఆణివార ఆస్థానం;
TTD: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. జూలై 16వ తేదీన ఆణివార ఆస్థానం సందర్భంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం కార్యక్రమం సుమారు 5 గంటలపాటు కొనసాగనుంది. తిరుమంజనం కార్యక్రమం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. తిరుమంజనం కారణంగా మంగళవారంనాడు నిర్వహించే అష్టదళపాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16వ తేదీన సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినం ఘనంగా జరుగనుంది.
చారిత్రక నేపథ్యం :
సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతినాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినంనాటి నుండి టీటీడీ వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి – ఏప్రిల్ నెలలకు మార్చారు.
ఉత్సవ విశిష్టత :
ఈ ఉత్సవం రోజున ఉదయం 7 గంటలకు బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేస్తారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీవిష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేస్తారు. ఈ ఉత్సవమూర్తులతో పాటు ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదిస్తారు.
జీయ్యంగార్ల వస్త్ర సమర్పణ :
తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యర్ స్వామి పెద్ద వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేస్తారు. వీటిలో నాలుగింటిని మూలమూర్తికి అలంకరిస్తారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామివారికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరిస్తారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాద వస్త్రంతో ”పరివట్టం”(చిన్న పట్టుగుడ్డ) కట్టుకొని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి ‘నిత్యైశ్వర్యోభవ’ అని స్వామివారిని ఆశీర్వదిస్తారు. ఆ తరువాత అర్చకులు తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యర్ స్వామివారికి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యర్ స్వామివారికి, టీటీడీ తరఫున కార్యనిర్వహణాధికారికి ‘లచ్చన’ అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడిచేతికి తగిలిస్తారు. హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాల చెంత ఉంచుతారు.
పుష్ప పల్లకీపై ఊరేగింపు :
ఆణివార ఆస్థానం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్పపల్లకీపై తిరుమల పురవీధుల గుండా ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు.