TTD Annaprasadam in Tirumala: వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన.. వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి అన్న స్తోత్రానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచే తిరుమల క్షేత్రం.. భక్తుల ఆకలి తీర్చే అన్నపూర్ణ నిలయంగానూ వెలుగొందుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం కోసం దేశ, విదేశాల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులకు టీటీడీ నిత్య అన్నప్రసాద సేవ ద్వారా ఉచితంగా ఆహారం అందిస్తోంది. భక్తుడు ఆకలితో ఉండకూడదన్న సంకల్పంతో తిరుమలలోని అన్నప్రసాద విభాగం 24 గంటలూ పనిచేస్తోంది. సాధారణ రోజుల్లో రోజుకు సుమారు 1.80 లక్షల నుంచి 1.90 లక్షల మంది అన్నప్రసాదాన్ని స్వీకరిస్తుండగా.. రద్దీ రోజులు, వారాంతాల్లో ఈ సంఖ్య 3 లక్షలకు పైగా చేరుతోంది. పానీయాలు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం కలిపి రోజుకు దాదాపు 3 లక్షల సర్వింగ్స్ భక్తులకు అందుతున్నాయి.

తిరుమలలో నిత్య అన్నదాన సేవకు 1985లో శ్రీకారం చుట్టారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు సంకల్పంతో 1985 ఏప్రిల్ 6న శ్రీ వేంకటేశ్వర నిత్యాన్నదాన పథకం ప్రారంభమైంది. అనంతరం 1994 ఏప్రిల్ 1న ఈ పథకాన్ని ట్రస్టుగా మార్చారు. ప్రస్తుతం శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ సేవలు మరింత విస్తృతంగా కొనసాగుతున్నాయి. తిరుమలతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లోనూ అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

భక్తులకు నిరంతరం ఆహారం అందించేందుకు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, శ్రీ అక్షయ వంటశాల, వకుళమాత వంటశాలలు 24 గంటలూ పనిచేస్తున్నాయి. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో రోజుకు 80 వేల మందికి పైగా భక్తులకు అన్నప్రసాదం అందుతోంది. ఉదయం ఉప్మా, పొంగలి, చట్నీ, సాంబార్ వంటి అల్పాహారంతో పాటు.. మధ్యాహ్నం, రాత్రి అన్నం, కూర, చట్నీ, వడ, సాంబార్, రసం, మజ్జిగ, స్వీట్ పొంగల్ తదితర పదార్థాలను భక్తులకు వడ్డిస్తున్నారు. శ్రీ అక్షయ వంటశాలలో గోధుమ రవ్వ ఉప్మా, సుజీ రవ్వ ఉప్మా, పొంగలి, సాంబారన్నం, పెరుగన్నం, టమోటా రైస్, సుండలు, పాలు, టీ, కాఫీ తదితరాలను తయారు చేస్తున్నారు. పర్వదినాలు, రద్దీ రోజుల్లో మజ్జిగ, బాదం పాలు, బిస్కెట్లు, జ్యూస్ ప్యాకెట్లను కూడా అందిస్తున్నారు. వకుళమాత వంటశాల నుంచి యాత్రికుల వసతి సముదాయాలు, కేంద్రీయ విచారణ కార్యాలయం, రామ్‌భగీచా అతిథి గృహం, అంజనాద్రి నిలయం తదితర ప్రాంతాల్లోని భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు.

శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండే భక్తులు ఆకలితో ఇబ్బంది పడకుండా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు, క్యూ లైన్ల వెలుపల ఏర్పాటు చేసిన కేంద్రాలు, PAC అన్నప్రసాద భవనాలు, వివిధ వసతి సముదాయాల్లోని భోజనశాలల ద్వారా భక్తులకు ఆహారం, పానీయాలు అందిస్తున్నారు. లక్షలాది మందికి భోజనం అందించేందుకు టీటీడీ భారీ స్థాయిలో ముడి పదార్థాలను వినియోగిస్తోంది. ప్రతిరోజూ సుమారు 15,788 కిలోల బియ్యం, 3,110 కిలోల సన్‌ఫ్లవర్ ఆయిల్, 2,861 కిలోల కందిపప్పు, 2,832 కిలోల సుజీ రవ్వ, 2,825 కిలోల గోధుమ రవ్వ వినియోగిస్తున్నారు. అలాగే 1,729 కిలోల మినప్పప్పు, 1,436 కిలోల ఉప్పు, 1,276 కిలోల బెల్లం, 497 కిలోల చింతపండుతో పాటు సుమారు 4,375 కొబ్బరికాయలు ప్రతిరోజూ వినియోగిస్తున్నారు.

2026 జనవరి 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు తిరుమలలోని వివిధ అన్నప్రసాద కేంద్రాల ద్వారా *9 కోట్లకు పైగా సర్వింగ్స్* భక్తులకు అందించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు తాజా, నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని తయారు చేసి అందిస్తున్నారు. అన్నప్రసాద సేవలను మరింత విస్తరించేందుకు టీటీడీ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. చట్నీలు, కూరల తయారీలో తాజా కొబ్బరికాయల వినియోగాన్ని ప్రవేశపెట్టింది. 2024లో *వకుళమాత సెంట్రలైజ్డ్ కిచెన్*ను ప్రారంభించి అదనంగా 28 ప్రాంతాలకు ఆహార పంపిణీ సేవలను విస్తరించింది. ఏడాది క్రితం ప్రారంభించిన PAC-5 (వెంకటాద్రి నిలయం) లో ఒకేసారి సుమారు 1,500 మంది భోజనం చేసేలా డైనింగ్ హాళ్లను ఏర్పాటు చేశారు. రోజుకు 2 లక్షల మంది భక్తులకు ఆహారం తయారు చేయగల సామర్థ్యంతో కొత్త శాటిలైట్ ఆటోమేటెడ్ కిచెన్ ఏర్పాటుకు కూడా చర్యలు కొనసాగుతున్నాయి. MTVAC కిచెన్‌లో ఆధునిక వంట పరికరాలను ఏర్పాటు చేయడంతో పాటు.. భక్తులు సులభంగా విరాళాలు అందించేందుకు QR కోడ్ ఆధారిత విరాళాల సేకరణ కియోస్క్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్‌కు భక్తులు అందించే విరాళాలే ఈ మహత్తర సేవకు ప్రధాన ఆధారం. …

Tags: