TTD Chairman Performs Special Puja at Papavinasam Dam: పాపవినాశనం డ్యామ్ వ‌ద్ద టీటీడీ చైర్మన్ ప్ర‌త్యేక పూజ‌లు

టీటీడీ చైర్మన్ ప్ర‌త్యేక పూజ‌లు

Update: 2025-10-28 04:54 GMT

TTD Chairman Performs Special Puja at Papavinasam Dam: గ‌త కొన్ని రోజులుగా తిరుమ‌ల‌లో కురిసిన వ‌ర్షాల‌తో జ‌లాశ‌యాలు నిండు కుండ‌ను త‌ల‌పిస్తున్నాయి. నీటి నిల్వ‌లు పూర్తిస్థాయికి చేరుకోవ‌డంతో పాపవినాశనం డ్యామ్ వ‌ద్ద ఆదివారం టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు ప్రత్యేక పూజ‌లు నిర్వ‌హించి గంగ హార‌తి స‌మ‌ర్పించారు.

ఈ సంద‌ర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ తిరుమలలోని జలాశయాలు 95 శాతం నిండిపోవడం శుభ పరిణామం అని సంతోషం వ్యక్తం చేశారు. పాపవినాశనం, గోగర్భం డ్యామ్ లు పూర్తిగా నిండిపోవడంతో గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు.

భక్తుల అవసరం కోసం తిరుమలలో ప్రతిరోజూ 50 లక్షల గ్యాలన్ల నీరు అవసరమవుతుండగా తిరుపతిలోని కళ్యాణి డ్యామ్ నుండి 25 లక్షల గ్యాలన్లు, తిరుమలలోని డ్యామ్ ల నుండి 25 లక్షల గ్యాలెన్ల నీటిని వినియోగిస్తున్నామన్నారు. తిరుమలలో 250 రోజుల నీటి అవసరాలకు సరిపడే నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. డ్యామ్ లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నీటి అవసరాలను సక్రమంగా నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ శాఖను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.

అదేవిధంగా టీటీడీ చరిత్రలో రికార్డుస్థాయిలో మొదటిసారి ఈ ఏడాది భారీ విరాళాలు వచ్చాయని తెలిపారు. గడిచిన 11 నెలల కాలంలో టీటీడీ ట్రస్టులకు రూ.918 కోట్లు విరాళాలు అందినట్లు ఆయన తెలియజేశారు.

Tags:    

Similar News