TTD: శ్రీవాణి భక్తుల ఆరోపణలపై టీటీడీ క్లారిటీ
టీటీడీ క్లారిటీ;
TTD: గురువారం ఉదయం శ్రీవారి ఆలయం ముందు శ్రీవాణి దర్శనాలకు వచ్చిన నలుగురు భక్తులు మీడియాతో మాట్లాడుతూ శ్రీవాణి టికెట్ల జారీలో ఆలస్యమవుతోందని, మంచి గదులు కేటాయించడం లేదని ఆరోపించడం జరిగింది. ప్రతిరోజూ ఉదయం 8.30 గంటలకు తిరుమలలో శ్రీవాణి టికెట్లు జారీ చేయడం జరుగుతోంది. అంతకంటే ఒక గంట ముందు వస్తే మాత్రమే భక్తులను కౌంటర్ వద్దకు అనుమతించడం జరుగుతోంది. అయితే సదరు భక్తులు వేకువఝామున 3.30 గంటలకు వచ్చి నిరీక్షించి, టికెట్ల కేటాయింపులో జాప్యం జరిగిందని, ఎటువంటి అన్నపానీయ సౌకర్యాలను టీటీడీ కేటాయించలేదని ఆరోపించడం సరికాదు. సాధారణంగా శ్రీవాణి టికెట్ కౌంటర్ తెరిచే సమయానికి ముందు నుండి టీ, కాఫీ, పాలు, మజ్జిగ నిరంతరం సరఫరా చేయడం జరుగుతుంది.
సాధారణంగా గురు, శుక్ర, శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు లేకపోవడంతో అధిక సంఖ్యలో భక్తులు శ్రీవాణి దర్శనాల కొరకు వస్తుంటారు. ముందు వచ్చినవారికి ముందు అనే ప్రాతిపదికలో పరిమిత సంఖ్యలో ఉండే శ్రీవాణి టికెట్లను టీటీడీ ప్రతిరోజూ (మరుసటి రోజు శ్రీవారి దర్శనం కొరకు) కేటాయిస్తుంది. సాధారణంగా తిరుమలలో వసతి గదులను పెద్ద మొత్తంలో సాధారణ భక్తులకు కేటాయించడం జరుగుతుంది. శ్రీవాణి భక్తులు సాధారణంగా తిరుపతి నుంచే వసతి తీసుకుని దర్శనానికి వెళ్లడం జరుగుతుంది. కానీ కొంతమంది తిరుమలలో డిమాండ్ చేస్తే అందుబాటులో ఉన్నవి మాత్రమే కేటాయించడం జరుగుతుంది.
అయితే టీబీసీ లో గదులు పొందిన భక్తులు గదులు పరిశుభ్రంగా లేవని, బొద్దింకలు ఉన్నాయని ఆరోపించడం జరిగింది. భక్తుల ఆరోపణలు తమ దృష్టికి రాగానే టీటీడీ తిరుమలలోని సదరు భక్తులకు కేటాయించిన టీబీసీ గదుల్లోని పారిశుద్ధ్యంపై తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీల్లో గదులన్నీ పరిశుభ్రంగానే ఉన్నాయి. ఎక్కడ గాని అపరిశుభ్రత లేదా బొద్దింకలు లేవు. తిరుమలలోని వసతి గదులు, మరుగుదొడ్లను, కంపార్ట్మెంట్లు, దర్శన క్యూలైన్లు, రోడ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు టీటీడీ ఆరోగ్య విభాగం (పారిశుద్ధ్యం) ఆధ్వర్యంలో పారిశుద్ధ్య సిబ్బంది 24×7 విశేషంగా కృషి చేస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్విరామంగా పని చేస్తుంటారు.
వాస్తవాలు ఇలా ఉండగా సదరు భక్తులు టీటీడీపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేయడం ఆక్షేపణీయం. గతంలో ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయం మేరకు టీటీడీపై అసత్య ఆరోపణలు చేస్తూ సంస్థ ప్రతిష్టను దిగజార్చే వారిపై టీటీడీ చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరిస్తోంది. ఈ సందర్భంగా తిరుమలలో ఉండే రద్దీని, పరిమిత సంఖ్యలోని వసతి గదులను దృష్టిలో పెట్టుకుని భక్తులు కూడా సంయమనంతో టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేయడమైనది.