TTD to Serve Delicious Annadanam: తిరుమల తరహాలో రుచికరంగా అన్నప్రసాదాలు : TTD

రుచికరంగా అన్నప్రసాదాలు : TTD

Update: 2025-12-02 08:54 GMT

TTD to Serve Delicious Annadanam: తిరుమల తరహాలో టిటిడి పరిధిలోని ఇతర ఆలయాలలో భక్తులకు అన్నప్రసాదాలను రుచికరంగా, శుచికరంగా, నాణ్యంగా అందించాలని టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. టిటిడిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో సోమవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, టిటిడి ఆధ్వర్యంలోని ఆలయాలలో అన్నప్రసాదాల పంపిణీకి సంబంధించి అన్నప్రసాదాల తయారు చేసే పోటు సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, అన్నప్రసాదాల పంపిణి పటిష్టంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. టిటిడి ఆలయాలలో ఇప్పటి వరకు పంపిణీ చేస్తున్న అన్నప్రసాదాలపై రోజు వారి నివేదికను తయారు చేయాలన్నారు. టిటిడిలో ఇంకనూ ఎవరైనా అన్య మతస్తులు ఉంటే వారిని గుర్తించి తదుపరి చర్య కొరకు నివేదిక తయారు చేయాలన్నారు. దేశవ్యాప్తంగా టిటిడి పరిధిలో చేరిన చారిత్రాక ఆలయాలకు, ఇతర ఆలయాలకు ఏఏ ఆలయాలకు వేదపారాయణదారులను నియమించాలి, ఎంత మంది అర్చకులను నియమించాలనే అంశంపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు.

టిటిడి పరిధిలో చేరిన ప్రతి ఆలయంపై ప్రామాణిక ఆపరేటింక్ విధానాన్ని (ఎస్.ఓ.పి) రూపొందించి వచ్చే సమావేశానికి నివేదించాలని సూచించారు. పోటు వర్కర్ల పేర్ల స్థానంలో ముఖ్య పాచిక, పాచిక పేర్లను మార్చాలని టిటిడి బోర్డులో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడి వేగంగా పోటు వర్కర్ల పేర్లను మార్చే ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. టిటిడిలోని అర్భన్ డెవలప్మెంట్ సెల్ ను పటిష్ట పర్చేందుకు వీలుగా తగిన సిబ్బంది తో కార్యాచరణ సిద్ధం చేయాలని చీఫ్ ఇంజనీర్ ను ఆదేశించారు. శ్రీనివాస కల్యాణాలను క్రమంగా నిర్వహించేందుకు వీలుగా ముందస్తుగా (క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ) ప్రణాళికలు రూపొందించాలన్నారు. తద్వారా భక్తులకు ముందుగానే కళ్యాణం సమాచారం అందడం వలన ఎక్కువ మంది పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందుతారని చెప్పారు.

అమరావతిలోని వెంకటపాలెంలో ఉన్న టిటిడి శ్రీ వేంకటేశ్వర ఆలయ విస్తరణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, 25 ఎకరాలలో ఇదివరకే ఉన్న ఆలయం తో పాటు ఇకపై నిర్మించనున్న కల్యాణ కట్ట, అర్చకులు, సిబ్బంది క్వార్టర్స్, ప్రాకారం, గోపురాలు, పుష్కరిణి, తదితర నిర్మాణాలపై కార్యాచరణ సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News