TTD's Mega Leap for Tirumala's Eco-Safety: తిరుమల పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట
పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట
TTD's Mega Leap for Tirumala's Eco-Safety: తిరుమల పవిత్రత, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని పాత డీజిల్, పెట్రోల్ వాహనాల స్థానంలో విద్యుత్ వాహనాలు వినియోగంలోకి తీసుకురావడానికి టిటిడి విస్తృత చర్యలు చేపట్టినట్లు టిటిడి అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుపతిలోని పద్మావతి విశ్రాంతి భవనంలో శుక్రవారంకేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ (ఢిల్లీ) సీనియర్ కన్సల్టెంట్ ప్రతినిధులు, ఆర్టీసీ, టిటిడి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ, ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు తిరుమలను సంపూర్ణ కాలుష్య రహిత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే అనేక చర్యలు చేపట్టామని తెలిపారు. మొదటిగా తిరుపతి–తిరుమల మధ్య పూర్తి స్థాయిలో విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు.
అదేవిధంగా, తిరుమలలో నడిచే ట్యాక్సీలు మరియు ఇతర అద్దె వాహనాలను విద్యుత్ వాహనాలతో దశలవారీగా భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఢిల్లీకి చెందిన సీనియర్ కన్సల్టెంట్ ప్రతినిధి శ్రీ కునాల్ జోషి వివిధ అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనిపై పూర్తి స్థాయి నివేదికను అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలో జరగనున్న టిటిడి బోర్డు సమావేశంలో ఈ అంశంపై చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు.