Offering Naivedyam to Lord Krishna: భగవంతుడు భావ ప్రియుడు. ఆయనకు మనం ఇచ్చే బంగారు ఆభరణాల కంటే, మనసు నిండా భక్తితో ఇచ్చే ఒక చిన్న తులసి దళం లేదా గుప్పెడు అటుకులు అంటేనే ఎంతో ఇష్టం. అందుకే శ్రీకృష్ణుడి పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆయన పరమ మిత్రుడు కుచేలుడు సమర్పించిన అటుకులు. అటుకుల ప్రసాదం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం, దాని వల్ల కలిగే ఫలితాల గురించి పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా శనివారం రోజున శ్రీకృష్ణుడికి అటుకులతో చేసిన ప్రసాదాన్ని నివేదించడం అత్యంత శుభప్రదమని నమ్ముతారు. అటుకులు, అన్నం, బెల్లం, పచ్చి కొబ్బరి తురుము కలిపి నైవేద్యంగా సమర్పిస్తే.. ఆ స్వామి అనుగ్రహం మనపై మెండుగా ఉంటుంది. ఎవరైతే తీవ్రమైన అప్పుల బాధలతో సతమతమవుతున్నారో, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో.. వారు ఈ విధంగా నైవేద్యం పెడితే ధనవృద్ధి కలిగి, సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల విశ్వాసం.

ఈ నైవేద్యంలో మరో విశేషం ఉంది. తేనె కలిపిన అటుకుల అన్నాన్ని శ్రీకృష్ణుడికి నివేదించి, ఆ ప్రసాదాన్ని కేవలం మనం మాత్రమే స్వీకరించకుండా.. నలుగురికి పంచిపెడితే మన జీవితంలోని సంకటాలన్నీ హరించుకుపోతాయి. అటుకులు పేదరికానికి చిహ్నమైతే, దానికి కలిపే బెల్లం, కొబ్బరి, తేనె.. జీవితంలోని తీపిని, సమృద్ధిని సూచిస్తాయి. ఆపదలో ఉన్నవారికి ఈ ప్రసాదాన్ని అందించడం అంటే సాక్షాత్తూ ఆ కృష్ణుడిని సేవించడమే.

కేవలం ఆర్థిక సమస్యలే కాకుండా, వివాహం కోసం ఎదురుచూస్తున్న యువతులకు కూడా ఇది ఒక అద్భుతమైన మార్గం. శనివారం నియమ నిష్టలతో శ్రీకృష్ణుడిని పూజించి అటుకుల ప్రసాదాన్ని సమర్పించే అమ్మాయిలకు సుగుణాల రాశి అయిన భర్త లభిస్తాడని మన పురాణాలు చెబుతున్నాయి.

Tags: