Uttar Pradesh CM Yogi Adityanath: శ్రీవారి సేవలో ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్
సీఎం యోగి ఆదిత్యనాథ్
Uttar Pradesh CM Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం సాయంత్రం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. తిరుమల విచ్చేసిన శ్రీ యోగి ఆదిత్యనాథ్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి స్వామివారి దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. అనంతరం టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి శ్రీవారి తీర్థప్రసాదాలను యూపీ సీఎంకు అందజేశారు.
ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ మహావిష్ణువు అవతారమైన శ్రీవేంకటేశ్వరస్వామిని ప్రార్థించి యావత్ దేశ ప్రజలకు స్వామివారి కృపాకటాక్షాలు కలగాలని కోరుకున్నట్లు తెలిపారు.
తిరుమలలో టీటీడీ చేపడుతున్న సమర్థవంతమైన క్యూ లైన్ల నిర్వహణ, పరిశుభ్రత, ఆధ్యాత్మిక వాతావరణ పరిరక్షణను ఆయన అభినందించారు.
పునర్వసు నక్షత్రం సందర్భంగా శ్రీవారి ఆలయంలో కొలువైన శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామివారి ఉత్సవమూర్తులను కూడా యూపీ సీఎం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగద్గురు శ్రీ రామానుజాచార్య సుమారు 1000 సంవత్సరాల క్రిందట తిరుమలలో ఏర్పాటు చేసిన వ్యవస్థ లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తో పాటు శ్రీరాముల వారి దివ్య రూపాన్ని కూడా తిరుమలలో నేడు దర్శించుకోవడం ఆనందదాయకమన్నారు.
తిరుమల పెద్ద జియ్యంగారు మరియు చిన్న జియ్యంగారు , ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు కూడా ఉన్నారు.
కాగా ఏపీ మంత్రలు శ్రీ నారాయణ, శ్రీ సత్య కుమార్ యాదవ్, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భానుప్రకాశ్ రెడ్డి తదితరులు యూపీ సీఎం తిరుమల దర్శనం లో పాల్గొన్నారు.