‘Dushta Chatushtayam’: దుష్టచతుష్టయం అంటే ఏంటి.? ఆ నలుగురు ఎవరు?

ఆ నలుగురు ఎవరు?

Update: 2026-04-18 01:53 GMT

‘Dushta Chatushtayam’: మన సమాజంలో, ముఖ్యంగా రాజకీయాల్లో ఎవరైనా నలుగురు వ్యక్తులు కలిసి ఏదైనా తప్పుడు పని చేసినా.. లేదా ఒకరిపై కుట్రలు పన్నినా.. వెంటనే వారిని 'దుష్టచతుష్టయం' అని సంబోధిస్తుంటాం. అసలు ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి ఉన్న చారిత్రక ,పౌరాణిక నేపథ్యం ఏమిటి? దీని గురించి తెలుసుకుందాం.

'దుష్టచతుష్టయం' అనే పదం మనకు మహాభారతం నుంచి లభించింది. మహాకవి తిక్కన సోమయాజి తాను రచించిన 'మహాభారత ఉద్యోగ పర్వం'లో తొలిసారిగా ఈ పదాన్ని ప్రయోగించారు. కురుసభలో పాండవులకు అన్యాయం చేస్తూ, అధర్మానికి పాల్పడిన నలుగురు వ్యక్తులను కలిపి ఆయన ఈ పేరుతో పిలిచారు. ఆ నలుగురు ఎవరో కాదు... దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని మరియు కర్ణుడు!

వీరిలో ఒక్కొక్కరిది ఒక్కో వ్యూహం. అహంకారానికి నిదర్శనం దుర్యోధనుడైతే, ఆ అహంకారానికి బలాన్ని ఇచ్చేవాడు తమ్ముడు దుశ్శాసనుడు. వీరి వెనుక ఉండి కుతంత్రాలతో మాయాజూదం ఆడించిన వాడు మేనమామ శకుని. ఇక వీరందరికీ అండగా నిలిచిన మహావీరుడు కర్ణుడు. ఈ నలుగురి కలయిక వల్లే కురుక్షేత్ర యుద్ధం అనివార్యమైందని, ధర్మాన్ని నాశనం చేయడానికి వీరు నిరంతరం ప్రయత్నించారని తిక్కన తన రచనలో పేర్కొన్నారు.

పురాణాల్లో ఉన్న ఈ పదం సామాన్య ప్రజల నాలుకపై నిలవడానికి ప్రధాన కారణం మన తెలుగు సినిమా వెండితెర అద్భుతం 'మాయా బజార్'. ఈ చిత్రంలో ఘటోత్కచుడు, కృష్ణుడు సంభాషించుకునే సందర్భంలో ఈ పదాన్ని వాడటం వల్ల.. ఇది సామాన్యులకు కూడా బాగా చేరువయ్యింది. అప్పటి నుంచి కుట్రలు చేసే ఏ నలుగురు వ్యక్తులకైనా ఈ పదం ఒక పర్యాయపదంగా మారిపోయింది.

Tags:    

Similar News