First Ritual Performed for the Lord in Tirumala: తిరుమలలో స్వామివారికి నిర్వహించే తొలి సేవ ఏంటీ?

స్వామివారికి నిర్వహించే తొలి సేవ ఏంటీ?

Update: 2025-10-08 04:54 GMT

First Ritual Performed for the Lord in Tirumala: కలియుగ వైకుంఠవాసుడు, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ప్రతి రోజు నిర్వహించే సేవల్లో మొట్టమొదటిది, అత్యంత ముఖ్యమైనది "సుప్రభాత సేవ". రోజువారీ పూజా కార్యక్రమాలన్నీ ఈ సేవతోనే ప్రారంభమవుతాయి. ఇది స్వామివారిని మేలుకొలిపే సేవగా ప్రసిద్ధి చెందింది. 'సుప్రభాతం' అంటే సంస్కృతంలో 'శుభోదయం' అని అర్థం. రాత్రి ఏకాంత సేవ తర్వాత శయనమందిరంలో విశ్రమించిన స్వామివారిని మేల్కొలపడానికి ఈ సేవను నిర్వహిస్తారు. సుప్రభాత సేవ ప్రతి రోజు తెల్లవారుజామున 2:30 గంటల నుండి 3:00 గంటల మధ్య జరుగుతుంది. ఈ సమయంలో భక్తులను గర్భగుడికి అతి సమీపం నుండి దర్శించుకునే అవకాశం లభిస్తుంది. దీనినే విశ్వరూప దర్శనం అని కూడా అంటారు.

సేవ ఎలా నిర్వహిస్తారు?

మేలుకొలుపు: అర్చక స్వాములు, వేద పండితులు బంగారు వాకిలి ముందు నిలబడి సుప్రభాతం శ్లోకాలను లయబద్ధంగా పఠిస్తారు. ఈ శ్లోకాలు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి మరియు మంగళాశాసనం అనే నాలుగు భాగాలుగా ఉంటాయి.

తలుపులు తెరవడం: సుప్రభాతం పఠిస్తుండగా, అర్చకులు శ్రీవారికి తొలి నివేదనగా నవనీతం (వెన్న), పాలు, చక్కెర సమర్పించి, నవనీత హారతి (తొలి కర్పూర హారతి) ఇస్తారు. అనంతరం బంగారు వాకిలి తలుపులు తెరుస్తారు.

తొలి దర్శనం (సన్నిధి గొల్ల): ఆనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం, ప్రతి రోజు ప్రప్రథమంగా స్వామి దర్శనాన్ని పొందే వ్యక్తి 'సన్నిధి గొల్ల' (యాదవుల వంశస్థుడు)గా ఉంటారు. ఆయన దివిటీ (కాగడా) పట్టుకుని వచ్చి ఆలయ ద్వారాలను తెరవడంలో పాలుపంచుకుంటారు.

భక్తుల దర్శనం: సుప్రభాత సేవలో పాల్గొనే భక్తులు గర్భగుడిలోకి వెళ్లి, శ్రీవారిని దగ్గరగా దర్శించుకుని, తీర్థం, శఠారి ఆశీర్వాదాలు స్వీకరిస్తారు.

సాధారణంగా ఏడాది పొడవునా సుప్రభాత సేవ జరుగుతుంది, కానీ ధనుర్మాసంలో మాత్రం దీనికి మినహాయింపు ఉంటుంది. ధనుర్మాసంలో సుప్రభాతం స్థానంలో ఆళ్వారులలో ఒకరైన గోదాదేవి రచించిన 'తిరుప్పావై' పాశురాలను పఠిస్తారు. తిరుమలలో రోజువారీ ఆర్జిత సేవల్లో సుప్రభాత సేవకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సేవలో పాల్గొనడానికి భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆన్‌లైన్ లక్కీ డిప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News