Ashwamedha Yaga Performed by Dasharatha: అయోధ్య చక్రవర్తి దశరథ మహారాజు తన వంశాన్ని ముందుకు తీసుకెళ్లే వారసుల కోసం అత్యంత ప్రతిష్టాత్మకమైన 'అశ్వమేధ యాగం' నిర్వహించారు. కోసల రాజ్యానికి అధిపతిగా అన్ని సంపదలు ఉన్నప్పటికీ, సంతానం లేదనే చింత ఆయనను ఎంతో కాలం వేధించింది. ఈ నేపథ్యంలో తన కులగురువు వశిష్ఠుడి సలహాతో, ఋష్యశృంగ మహర్షి నేతృత్వంలో ఈ మహా యజ్ఞానికి శ్రీకారం చుట్టారు.

ఈ యాగం ఇతర పూజల వలే ఒక రోజులో పూర్తయ్యేది కాదు. దీనికి ప్రధాన అంగం ఒక పవిత్రమైన గుర్రం (అశ్వం). శాస్త్రోక్తంగా పూజలు చేసిన అనంతరం ఒక గుర్రాన్ని స్వేచ్ఛగా వదిలివేస్తారు. ఆ గుర్రం వెంట సైన్యం ఉంటుంది. ఆ గుర్రం తిరిగిన దేశాలన్నీ దశరథుడి సార్వభౌమత్వాన్ని అంగీకరించాలి, ఎవరైనా గుర్రాన్ని ఆపితే యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఇలా ఒక సంవత్సరం పాటు ప్రపంచమంతా తిరిగి ఆ గుర్రం క్షేమంగా అయోధ్యకు తిరిగి రావడంతో యాగం యొక్క ప్రధాన ఘట్టం మొదలవుతుంది.

సరయూ నది తీరంలో జరిగిన ఈ యాగంలో ఋష్యశృంగుడు బ్రహ్మగా వ్యవహరించారు. అశ్వమేధ యాగం దిగ్విజయంగా పూర్తి కావడంతో, దశరథుడి కోరిక మేరకు మహర్షి 'పుత్రకామేష్టి' అనే మరో విశేష యాగాన్ని కూడా నిర్వహించారు. ఈ యాగం ముగింపులో యజ్ఞకుండం నుంచి ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించి, అమృతంతో కూడిన పాయస పాత్రను దశరథుడికి అందించారు.

ఈ పాయసాన్ని దశరథుడు తన ముగ్గురు భార్యలైన కౌసల్య, కైకేయి మరియు సుమిత్రలకు పంచగా.. తదనంతరం లోక కల్యాణం కోసం శ్రీమహావిష్ణువు రాముడిగా, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులుగా జన్మించారు. కేవలం సంతానం కోసమే కాకుండా, రాజ్య క్షేమం మరియు పాప ప్రక్షాళన కోసం కూడా ఈ అశ్వమేధ యాగాన్ని నిర్వహించడం ఒక వైదిక సంప్రదాయం.

Tags: