Diwali: దీపావళి ఎప్పుడు? లక్ష్మీ పూజ శుభ ముహూర్తం, తిథి వివరాలివే..
తిథి వివరాలివే..
Diwali: చీకటిని పారద్రోలి వెలుగులు నింపే దీపాల పండుగ దీపావళికి హిందూ సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. జ్ఞానం, మంచితనం, ఆనందానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను దేశవ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇళ్ల ముందు దీపాలు వెలిగించి, నోరూరించే మిఠాయిలు పంచుకుంటూ, బాణాసంచా కాలుస్తూ కుటుంబ సమేతంగా సంబరాలు చేసుకుంటారు. ఈ ఏడాది (2026) దీపావళి పండుగను నవంబర్ 8, ఆదివారం నాడు జరుపుకోనున్నారు.
పండుగ వెనుక పురాణ గాథలు
దీపావళి పండుగ ఆచరణ వెనుక పలు పౌరాణిక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
శ్రీరాముడి అయోధ్యా ప్రవేశం: రావణుడిని సంహరించి, 14 సంవత్సరాల అరణ్యవాసం ముగించుకుని శ్రీరాముడు సీతా, లక్ష్మణ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చిన రోజునే దీపావళిగా జరుపుకుంటారు. తమ ప్రభువు రాకతో ఆనందోత్సాహాల్లో మునిగిన అయోధ్యావాసులు ఊరంతా దీపాలు వెలిగించి ఘన స్వాగతం పలికారు.
నరకాసుర వధ:
ప్రజలను, దేవతలను ముప్పుతిప్పలు పెట్టిన నరకాసురుడిని సత్యభామా సమేతుడై శ్రీకృష్ణుడు సంహరించిన విజయానికి ప్రతీకగా దీపావళి వేడుకలు నిర్వహిస్తారు.
క్షీరసాగర మథనం - లక్ష్మీదేవి ఆవిర్భావం:
క్షీరసాగర మథనంలో సంపదలకు అధిదేవత అయిన మహాలక్ష్మి ఆవిర్భవించిన పవిత్ర దినంగా భావించి, దీపావళి రాత్రి లక్ష్మీ పూజను అత్యంత భక్తితో నిర్వహిస్తారు.
లక్ష్మీ పూజ శుభ ముహూర్తం & తిథి వివరాలు
సంపద, శ్రేయస్సును ప్రసాదించే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం దీపావళి నాడు ప్రదోష కాలంలో, స్థిర లగ్నంలో పూజ చేయడం అత్యంత శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు.
లక్ష్మీ పూజ ముహూర్తం: సాయంత్రం 06:27 PM నుండి రాత్రి 08:27 PM వరకు
పూజా వ్యవధి: 2 గంటల పాటు ముహూర్తం అందుబాటులో ఉంటుంది.
ప్రదోష కాలం: సాయంత్రం 06:02 PM నుండి రాత్రి 08:34 PM వరకు
వృషభ కాలం (స్థిర లగ్నం): సాయంత్రం 06:27 PM నుండి రాత్రి 08:27 PM వరకు
అమావాస్య తిథి ప్రారంభం: నవంబర్ 08, 2026న ఉదయం 11:27 గంటలకు
అమావాస్య తిథి సమాప్తి: నవంబర్ 09, 2026న మధ్యాహ్నం 12:31 గంటలకు
ప్రదోషకాలంతో పాటు స్థిర లగ్నమైన వృషభ కాలం కలిసి వచ్చే సాయంత్రం 06:27 నుంచి రాత్రి 08:27 మధ్య సమయంలో మహాలక్ష్మి, వినాయకుడిని ఆరాధించడం విశేష ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు.