Which Direction Should You Light Diyas on Diwali: చీకటిని పారద్రోలి వెలుగులను, చెడును తుదముట్టించి మంచిని ఆహ్వానించే దివ్య పండుగ దీపావళి. ఇళ్లను రంగురంగుల ముగ్గులు, తోరణాలతో ముస్తాబు చేయడంతో పాటు దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో ఆహ్వానిస్తారు. అయితే దీపావళి నాడు దీపాలు ఏ దిశలో వెలిగిస్తున్నారనే దానికి ఆధ్యాత్మికంగా, వాస్తు శాస్త్ర పరంగా ఎంతో విశిష్ట ప్రాముఖ్యత ఉంది. సరైన దిశలో దీపాలు వెలిగించడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి, సంపద, మనశ్శాంతి చేకూరుతాయని విశ్వాసం.

తూర్పు దిశ: సంతోషం, ప్రగతికి సంకేతం

సూర్యోదయానికి ప్రతీక అయిన తూర్పు దిశను నూతన ఆరంభాలకు కేంద్రంగా భావిస్తారు.ఈ దిశలో దీపాలు వెలిగించడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. కుటుంబ సభ్యులకు మానసికప్రశాంతత లభించడంతో పాటు అన్ని రంగాల్లో పురోగతి, ఆయురారోగ్యాలు చేకూరుతాయని నమ్ముతారు.

ఉత్తర దిశ: సిరిసంపదలు, కుబేర కటాక్షం

ఉత్తర దిక్కు సంపదలకు అధిపతి అయిన కుబేరుడి స్థానంగా శాస్త్రాలు చెబుతున్నాయి. దీపావళి పూజలో లక్ష్మీదేవితో పాటు కుబేరుడి అనుగ్రహం పొందడానికి ఉత్తర దిశ ఎంతో అనువైనది. ఈ దిక్కున దీపాలు వెలిగించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, సంపద మరియు వ్యాపార వృద్ధి కలుగుతాయి.

పడమర దిశ: కుటుంబ ఐక్యత, శాంతి

పడమర దిశలో దీపాలను ఉంచడం కూడా ఎంతో శుభప్రదం. ఈ దిశలో వెలిగించే దీపాలు కుటుంబంలో కలహాలు, అశాంతిని దూరం చేసి సామరస్యాన్ని పెంచుతాయి. జీవితంలో ఎదురయ్యే అవరోధాలు, ఆటంకాలను అధిగమించడానికి ఈ దిక్కు అనుకూలంగా పనిచేస్తుంది.

ప్రధాన ద్వారం వద్ద దీపాలు ఎందుకు వెలిగించాలి?

దీపావళి పర్వదినాన ఇంటి ప్రధాన గుమ్మం (సింహద్వారం) ఇరువైపులా దీపాలు వెలిగించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించడానికి ఇది ప్రతీక. గుమ్మం ముందు దీపాలు వెలుగుతుంటే దుష్ట శక్తులు, ప్రతికూల శక్తులు నశించి, అష్టైశ్వర్యాలు ఇంట్లోకి ప్రవేశిస్తాయని విశ్వసిస్తారు.

ఈ ప్రదేశాల్లో తప్పనిసరిగా దీపాలు పెట్టండి..

పూజ గది:

ఇష్టదైవం, లక్ష్మీదేవి పూజ సమయంలో అఖండ జ్యోతి లేదా ప్రత్యేక దీపాలను ఉంచాలి.

తులసి కోట: తులసి మొక్క వద్ద దీపం వెలిగిస్తే సాక్షాత్తూ మహాలక్ష్మి కొలువుదీరుతుందని ప్రతీతి.

ఇంటి ఆవరణ:

పెరడు, బాల్కనీలలో సైతం దీపాలు ఉంచడం వల్ల పరిసరాలు శుభప్రదంగా మారతాయి.

Tags: