Lord Venkateswara Darshan: వెయ్యి జన్మల పాపం పోవాలంటే ఏ నక్షత్రం రోజు శ్రీవారిని దర్శించాలి?
నక్షత్రం రోజు శ్రీవారిని దర్శించాలి?
Lord Venkateswara Darshan: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అయితే, పురాణాల ప్రకారం ఒక్కో నక్షత్రం రోజున స్వామివారిని దర్శించుకోవడం వల్ల ప్రత్యేకమైన, విభిన్నమైన ఫలితాలు కలుగుతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఏ నక్షత్రం రోజున స్వామిని దర్శిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం!
మనకు ఉన్న 27 నక్షత్రాలలో... అశ్విని నక్షత్రం రోజు శ్రీవారిని దర్శిస్తే దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. భరణి నక్షత్రం రోజున అకాల మరణ భయం, లేదా అపమృత్యు భయం తొలగిపోతుంది. ఇక విద్యార్థులు కృత్తిక నక్షత్రం రోజున స్వామివారిని దర్శిస్తే చక్కటి చదువు, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించే శక్తి లభిస్తుంది.
రోహిణి నక్షత్రం రోజున ఎలాంటి మానసిక సమస్యలైనా ఇట్టే తొలగిపోతాయి. ఇక స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన 'మృగశిర' నక్షత్రం రోజున దర్శనం చేసుకుంటే సర్వశుభాలు కలుగుతాయి. ఆరుద్ర నక్షత్రం రోజున ఎటువంటి ఆపదలు రాకుండా స్వామి కాపాడుతాడు. పునర్వసు నక్షత్రం రోజున ఆర్థిక బాధలు, మానసిక ఒత్తిడి తొలగిపోయి కుటుంబంలో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా పుష్యమి నక్షత్రం రోజున శ్రీవారిని దర్శించుకుంటే వెయ్యి జన్మల పాపాలు నశిస్తాయని నమ్ముతారు.
ఆశ్లేష నక్షత్రం రోజున శారీరక, మానసిక సమస్యలు మాయమై మనసంతా ప్రశాంతతతో నిండిపోతుంది. మఖ నక్షత్రం రోజున అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పుబ్బ నక్షత్రం రోజున కన్యలకు త్వరగా వివాహం కుదురుతుంది; పెళ్లి ఆలస్యం అవుతున్న యువకులకు వెంటనే వివాహం నిశ్చయమవుతుంది. ఉత్తర నక్షత్రం రోజున సర్వసౌభాగ్యాలు, హస్త నక్షత్రం రోజున అనారోగ్య సమస్యలు క్షణంలో తొలగిపోతాయి.
చిత్త నక్షత్రం రోజున యశస్సు, సకల సంపదలు కలుగుతాయి. స్వాతి నక్షత్రం రోజున అపమృత్యు భయం తొలగిపోతుంది. విశాఖ నక్షత్రం రోజున పెళ్లి కానివారికి మంచి జీవిత భాగస్వామి లభిస్తారు. అనూరాధ నక్షత్రం రోజున ఎంతోకాలం నుంచి తీరని అప్పులు కొద్ది నెలల్లోనే తీరిపోతాయి. జ్యేష్ట నక్షత్రం రోజున ఉన్నత పదవులు, మూల నక్షత్రం రోజున సర్వవిద్యలు, పరీక్షలలో అద్భుత విజయాలు సిద్ధిస్తాయి.
పూర్వాషాఢ రోజున విశేషమైన సంపద, ఉత్తరాషాఢ రోజున అనారోగ్య సమస్యలు తొలగి మనస్సుకు ప్రశాంతత కలుగుతాయి. శ్రవణ నక్షత్రం రోజున దర్శించుకుంటే జీవించినంతకాలం సుఖంగా ఉండి, అంత్యమున ముక్తిని పొందుతారు. ధనిష్ట రోజున అపారమైన ఐశ్వర్యం, అలాగే శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాల రోజులలో కూడా స్వామివారిని దర్శించడం విశేష శుభఫలాలను ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి.