Hindu Weddings Begin Only After Tulsi-Shaligram Vivah: కార్తీకమాసం శుక్ల పక్షం ద్వాదశి రోజున తులసీ మాతకు, శాలిగ్రామ స్వామికి కళ్యాణం జరిపించిన తర్వాతే మానవుల వివాహ ముహూర్తాలు ప్రారంభమవుతాయి. 2026 సంవత్సరంలో ఈ పర్వదినం నవంబర్ 21న వచ్చింది. హిందూ సంప్రదాయంలో ఈ కళ్యాణం కేవలం ఆచారం మాత్రమే కాదు. ఇది శుభకార్యాలకు తెరలేపే పవిత్రమైన మైలురాయి.

కార్తీకమాసం దేవుత్తాన ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొంటారు. మరుసటి రోజు ద్వాదశి నాడు శాలిగ్రామ రూపంలో ఉన్న విష్ణుమూర్తి తులసీమాతను వివాహం చేసుకుంటారు. ఈ వేడుక తర్వాతే పెళ్లి ముహూర్తాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు ప్రారంభమవుతాయని పండితులు చెబుతున్నారు.

ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళ్తారు. దీనిని దేవశయని ఏకాదశి అంటారు. ఆ తర్వాత నాలుగు నెలల పాటు చాతుర్మాసం కొనసాగుతుంది. ఈ సమయంలో వివాహాలు, ఇతర శుభకార్యాలు నిర్వహించకూడదని శాస్త్రం చెబుతోంది. విష్ణుమూర్తి నిద్రలేచిన మరుసటి రోజే తులసి కళ్యాణం జరుగుతుంది. దీంతో శుభకార్యాలకు మళ్లీ శ్రీకారం చుడతారు.

పురాణాల ప్రకారం సత్యయుగంలో వృంద అనే గొప్ప పతివ్రత ఉండేది. ఆమె జలంధరుడు అనే రాక్షసుడిని వివాహం చేసుకుంది. వృంద పాతివ్రత్య మహిమతో జలంధరుడు అత్యంత శక్తివంతుడయ్యాడు. దేవతలు సైతం అతడిని ఓడించలేకపోయారు. లోకకల్యాణం కోసం విష్ణుమూర్తి జలంధరుడి రూపంలో వృంద వద్దకు వెళ్లి ఆమె పాతివ్రత్యాన్ని భంగం చేశారు. దీంతో జలంధరుడి శక్తి తగ్గి యుద్ధంలో మరణించాడు.

ఈ విషయం తెలుసుకున్న వృంద తీవ్ర ఆగ్రహంతో విష్ణుమూర్తిని శిలగా మారమని శపించింది. అనంతరం ఆమె ప్రాణాలు విడిచింది. పతివ్రత శాపం ఎంతటి మహానుభావులైనా అనుభవించాల్సిందే. వృంద త్యాగానికి గుర్తుగా ఆమె బూడిద నుంచి పవిత్రమైన తులసి మొక్క ఆవిర్భవించింది. వృంద కోరిక మేరకు విష్ణుమూర్తి శాలిగ్రామ రూపంలో ఆమెను వివాహం చేసుకుంటానని వరమిచ్చారు. అప్పటి నుంచి కార్తీక శుక్ల ద్వాదశి రోజున తులసి-శాలిగ్రామ కళ్యాణం జరిపించే సంప్రదాయం ప్రారంభమైంది.

తులసి కళ్యాణం కేవలం ఆచారం మాత్రమే కాదు. ఇందులో కుటుంబ బంధాలు, దాంపత్య జీవితం, భక్తి, పవిత్రత వంటి ఎన్నో ఆధ్యాత్మిక భావాలు ఇమిడి ఉన్నాయి. సంతానం లేని దంపతులు తులసి వివాహాన్ని కన్యాదాన సంప్రదాయంలో నిర్వహిస్తే కన్యాదానం చేసినంత పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. తులసి మాత, శాలిగ్రామ స్వామికి వివాహం జరిపించడం వల్ల దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వైవాహిక జీవితంలోని ఆటంకాలు తొలగి కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఇంట్లో లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభించి ఐశ్వర్యం, సంతోషం కలుగుతాయని భక్తులు భావిస్తారు.

తులసి మొక్కను అందంగా అలంకరించి చెరకు గడలతో పందిరి వేసి పూలు, పసుపు, కుంకుమలతో శోభాయమానంగా తీర్చిదిద్దుతారు. అనంతరం శాలిగ్రామ స్వామితో తులసి మాతకు సంప్రదాయబద్ధంగా వివాహం జరిపిస్తారు. మంగళహారతులు ఇచ్చి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఈ వేడుకను చూడటం వల్ల జీవితాంతం సంచితమైన పాపాలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఈ కళ్యాణాన్ని ఉసిరి కొమ్మతో కూడా నిర్వహిస్తారు. కొందరు శ్రీకృష్ణుడి ప్రతిమను వరుడిగా భావించి వేడుక జరుపుతారు. ఇలా తులసి వివాహాన్ని జరుపుకోవడం వల్ల శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ పవిత్ర వేడుక తర్వాతే మానవ వివాహాలు శుభప్రదంగా జరుగుతాయనేది సంప్రదాయ విశ్వాసం.

Tags: