Pournami-Auspicious Day: పౌర్ణమికి ఎందుకంత ప్రాధాన్యత..ఆ రోజు చేయాల్సిన పనులేంటి.?
ఆ రోజు చేయాల్సిన పనులేంటి.?
Pournami-Auspicious Day: పౌర్ణమిని సంస్కృతంలో పూర్ణిమ లేదా తెలుగులో పున్నమి అని కూడా అంటారు. ఇది హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలా వచ్చే ఒక ముఖ్యమైన తిథి.పౌర్ణమి అంటే చంద్రమానం ప్రకారం శుక్ల పక్షంలో (వృద్ధి చెందుతున్న దశ) చంద్రుడు పూర్తిగా నిండుగా ఉండే తిథి.ఈ రోజున చంద్రుడు భూమి నుండి సంపూర్ణంగా, కాంతివంతంగా కనిపిస్తాడు.ఖగోళ శాస్త్రం ప్రకారం, భూమి సూర్యుడు, చంద్రుడి మధ్య ఉండే రోజు ఇది.హిందూ సంప్రదాయంలో పౌర్ణమిని శుభదినంగా భావిస్తారు, దీని అధిదేవత చంద్రుడు.
పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటంటే.. పౌర్ణమికి మతపరంగా, ఆధ్యాత్మికంగా, శాస్త్రీయంగా కూడా చాలా ప్రాముఖ్యత ఉంది.పౌర్ణమిని సంపూర్ణత్వం, సమృద్ధి, శ్రేయస్సుకు ప్రతీకగా భావిస్తారు.పౌర్ణమి రోజున చంద్రుని గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉండటం వలన సముద్రపు అలలపై (పోటు, పాటు) తీవ్ర ప్రభావం చూపుతుంది.కొన్ని నమ్మకాల ప్రకారం, ఈ రోజున భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి కూడా అధికంగా ఉండి, మానవునిపై సానుకూల ప్రభావం చూపుతూ, శరీరము మనస్సు మధ్య సమతుల్యతను కలిగిస్తుంది.
పౌర్ణమి రోజు చేసే ముఖ్యమైన పనులు
పౌర్ణమి రోజున చేసే ఆచారాలు నెలవారీ పండుగను బట్టి మారుతుంటాయి. సాధారణంగా చేసే ముఖ్యమైన పనులు
ఉదయాన్నే నిద్రలేచి పవిత్ర నదిలో లేదా శుభ్రమైన నీటితో స్నానం చేస్తారు.
చాలా మంది పౌర్ణమి రోజున ఉపవాసం ఉండి, చంద్రుడిని చూసిన తర్వాత వ్రతాన్ని ముగిస్తారు. కొందరు సత్యనారాయణ వ్రతం లేదా ఆ నెల పండుగకు సంబంధించిన వ్రతాలు చేస్తారు.
శివాలయాలు, విష్ణాలయాల్లో దీపాలు వెలిగించడం,దీప దానం చేయడం చాలా పుణ్యఫలంగా భావిస్తారు (ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున).
ఆ నెల ప్రాముఖ్యతను బట్టి శివుడు, విష్ణువు, లక్ష్మీదేవి వంటి దేవతలను పూజిస్తారు.
రాత్రి సమయంలో చంద్రుడికి పచ్చి పాలను నీటిలో కలిపి అర్ఘ్యం సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు.
ఈ రోజున పేదవారికి ఆహారం, దుస్తులు, బెల్లం వంటివి దానం చేయడం శుభఫలితాలను ఇస్తుందని నమ్ముతారు.