Look Back After Funeral Rites: అంత్యక్రియల తర్వాత వెనక్కి తిరిగి ఎందుకు చూడొద్దు.. దీని వెనుక ఉన్న అసలు కారణం ఇదే..
దీని వెనుక ఉన్న అసలు కారణం ఇదే..
Look Back After Funeral Rites: హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మానవ జీవితంలో 16 రకాల సంస్కారాలు ఉంటాయి. అందులో చివరిది, అత్యంత ముఖ్యమైనది అంత్యేష్టి లేదా దహన సంస్కారం. ఈ పదహారవ సంస్కారం తర్వాతే ఆత్మ తన పాత భౌతిక బంధాలను తెంచుకుని, కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తుందని నమ్మకం. అయితే శ్మశానవాటికలో దహన సంస్కారాలు ముగిసిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు అనే నియమం ఉంది. అసలు ఈ సంప్రదాయం వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆత్మ అమరమైనది..
శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్లుగా.. ఆత్మను ఆయుధాలు ఛేదించలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి ఎండబెట్టలేదు. శరీరం నశించినప్పటికీ, ఆత్మ ఉనికి అలాగే ఉంటుంది. మరణం సంభవించిన క్షణం నుండి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు జరిగే ప్రతి ఆచారాన్ని ఆత్మ గమనిస్తూనే ఉంటుందని గరుడ పురాణం చెబుతోంది.
వెనక్కి తిరిగి చూడకపోవడానికి కారణం ఏంటి?
దహన సంస్కారాల తర్వాత శ్మశానవాటిక నుండి బయటకు వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకపోవడం వెనుక ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.
మమకారం - బంధం:
ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా అతని ఆత్మ తన కుటుంబ సభ్యులతో, ఇంటితో అనుబంధాన్ని కలిగి ఉంటుంది. దహనం చేయడం ద్వారా ఆత్మను భౌతిక శరీరం నుండి వేరు చేస్తారు. ఒకవేళ కుటుంబ సభ్యులు వెనక్కి తిరిగి చూస్తే, ఆత్మకు తమపై ఇంకా మమకారం ఉందన్న ఆశ కలుగుతుంది. ఇది ఆత్మ తన తదుపరి ప్రయాణానికి ఆటంకం కలిగిస్తుంది.
ప్రేత లోకం నుండి విముక్తి: శ్మశానవాటిక నుండి వెనక్కి తిరిగి చూడకుండా రావడం అంటే.. "నీతో మాకున్న భౌతిక బంధం ముగిసింది.. నీవు ప్రశాంతంగా నీ దారిలో వెళ్లు" అని ఆత్మకు తుది వీడ్కోలు పలకడం. దీనివల్ల ఆత్మ ఆశను వదులుకుని పరలోక ప్రయాణానికి సిద్ధమవుతుంది.
13 రోజుల ప్రయాణం
మరణం తర్వాత 13 రోజుల పాటు వివిధ ఆచారాలు నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆత్మ తన కుటుంబం తనకు వీడ్కోలు ఎలా ఇస్తుందో చూస్తుంది. దహన సంస్కారాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే, ఆ ఆత్మ మళ్లీ మాయా ప్రపంచంలోకి లాగబడుతుంది. ఇది ఆత్మకు మరిన్ని కష్టాలను, మానసిక క్షోభను కలిగిస్తుంది. అందుకే ఆత్మ నిర్వేదంతో, ప్రశాంతంగా ఈ లోకాన్ని వీడాలనే ఉద్దేశంతోనే మన పెద్దలు ఈ నియమాన్ని పెట్టారు.