Applying Toothpaste on Burns: వంటగదిలో పనులు చేస్తుండగా వేడి నూనె తుంపర్లు పడటం లేదా వేడి పాత్రలు తగలడం సాధారణమే. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది వెంటనే చేసే పని కాలిన చోట టూత్‌పేస్ట్ రాయడం. మంట తగ్గి చల్లదనం వస్తుందని భావిస్తారు. కానీ వైద్య నిపుణుల ప్రకారం ఇలా చేయడం పూర్తిగా సురక్షితం కాదు. దీనివల్ల గాయం మరింత తీవ్రమవుతుంది.

టూత్‌పేస్ట్ దంతాల శుభ్రత కోసం తయారు చేసినది మాత్రమే.కాలిన గాయాలకు ఉపయోగించడానికి కాదు. ఇందులో ఉండే మింట్ ఫ్లేవర్, రసాయనాలు కాలిన చర్మానికి మరింత మంటను, ఇరిటేషన్‌ను కలిగిస్తాయి. గాయం మీద పేస్ట్ రాయడం వల్ల ఇన్ఫెక్షన్ ముప్పు పెరుగుతుంది. ఆసుపత్రికి వెళ్లినప్పుడు గాయం తీవ్రతను వైద్యులు సరిగ్గా అంచనా వేయడానికి కూడా ఇది అడ్డంకిగా మారుతుంది.

కాలిన వెంటనే చేయాల్సిన మొదటి పని ఏమిటంటే.. కాలిన భాగాన్ని కనీసం 20 నిమిషాల పాటు చల్లని నీటి ధార కింద ఉంచాలి. ట్యాప్ వాటర్ ఉపయోగించవచ్చు. దీనివల్ల చర్మం ఉష్ణోగ్రత తగ్గి లోపలి కణజాలం దెబ్బతినకుండా ఉంటుంది. చేతికి ఉంగరాలు, వాచీలు లేదా బిగుతుగా ఉండే దుస్తులు ఉంటే చర్మం ఉబ్బకముందే సున్నితంగా తీసేయాలి.

కాలిన చర్మానికి దుస్తులు అతుక్కుపోతే వాటిని బలవంతంగా లాగకూడదు. దీనివల్ల చర్మం మరింత దెబ్బతింటుంది. నీటితో చల్లబరిచిన తర్వాత శుభ్రమైన, చర్మానికి అంటుకోని పల్చటి బ్యాండేజ్ వేయాలి. ఇది గాయాన్ని రక్షిస్తుంది.

కాలిన చోట నీటి బుడగలు వస్తే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ చిదపకూడదు. ఇలా చేస్తే బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్లు వస్తాయి. టూత్‌పేస్ట్ మాత్రమే కాకుండా నెయ్యి, నూనె లేదా ఐస్ ముక్కలు కూడా అస్సలు పెట్టకూడదు. ఇవి గాయాన్ని మరింత దెబ్బతీస్తాయి.

ముఖం, చేతులు, పాదాలపై కాలినా లేదా గాయం పెద్దదైనా, తీవ్రత ఎక్కువగా ఉన్నా ఇంటి చిట్కాలపై ఆధారపడకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. చిన్నపిల్లలు, వృద్ధులకు కాలిన గాయాలైతే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే ఆసుపత్రికి తీసుకెళ్లాలి.

కాలిన గాయాలపై సరైన ప్రథమ చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. తప్పు పద్ధతులు అనుసరించడం వల్ల సమస్యలు పెరుగుతాయి. కాబట్టి ఎప్పుడూ వైద్య సలహా మేరకు వ్యవహరించాలి. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలపై నిర్ణయాలు తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags: