Fresh Vegetables: కూరగాయలు ఫ్రెష్ గా ఉన్నాయా.. ఎలా గుర్తించాలి..?
ఎలా గుర్తించాలి..?;
Fresh Vegetables: మార్కెట్ కు వెళ్లే వారు అక్కడ తాజా కూరగాయలను ఎలా గుర్తించాలి. పురుగులు,పుచ్చులు,లోపల మంచిగ ఉన్నాయా లేదా ఎలా తెలుసుకోవాలి. వారం రోజుల వరకు పాడవకుండా ఉండాలంటే తాజా కూరగాయలను తీసుకోవాలి. మరి మార్కెట్లో తాజా కూరగాయాలను గుర్తించే కొన్ని చిట్కాలు మీకోసం.ఈ పద్ధతులను ఉపయోగించి మీరు మంచి, తాజా కూరగాయలను ఎంచుకోవచ్చు.
రంగు, మెరుపు: తాజా కూరగాయలు మంచి ప్రకాశవంతమైన రంగుతో, సహజమైన మెరుపుతో ఉంటాయి. రంగు లేతగా, పాలిపోయినట్లుగా ఉంటే అవి పాతవని అర్థం చేసుకోవచ్చు.
స్పర్శ, గట్టిదనం: కూరగాయలను చేత్తో నొక్కి చూసినప్పుడు అవి గట్టిగా, దృఢంగా ఉండాలి. మెత్తగా, నొక్కినప్పుడు లోపలికి వెళ్లేవి తాజాగా ఉండకపోవచ్చు. ఉదాహరణకు, వంకాయలు, బెండకాయలు, క్యారెట్లు గట్టిగా ఉండాలి.
ఆకులు, కాండం: ఆకు కూరలు (తోటకూర, పాలకూర) తాజాగా ఉన్నప్పుడు వాటి ఆకులు పచ్చగా, వడిలిపోకుండా ఉంటాయి. కాండం కూడా తాజాగా, విరిగిపోకుండా ఉండాలి. కాండం పొడిబారి, ఆకులు రంగు మారి ఉంటే అవి తాజాగా లేవని అర్థం.
వాసన: కూరగాయలకు సహజమైన, తియ్యని వాసన ఉంటుంది. చెడు వాసన, పుల్లటి వాసన వస్తే వాటిని కొనకుండా ఉండటం మంచిది.
మచ్చలు, పగుళ్లు: తాజా కూరగాయలపై పగుళ్లు, రంధ్రాలు, మచ్చలు ఉండవు. అలాంటివి ఉంటే అవి పాడైపోయే దశలో ఉన్నాయని అర్థం.
బరువు: తాజాగా ఉన్న కూరగాయలు కొంత బరువుగా ఉంటాయి. బరువు తక్కువగా, తేలికగా ఉంటే లోపల తేమ కోల్పోయాయని అర్థం చేసుకోవచ్చు.