First Signs of HIV Appear in the Mouth: శరీరంలోకి ప్రవేశించే హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ క్రమంగా రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. సరైన సమయంలో గుర్తింపు, వైద్య చికిత్స లేకపోతే ఇది చివరి దశ అయిన ఎయిడ్స్ స్థాయికి చేరుకుంటుంది. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఎయిడ్స్ ప్రొవైడర్స్ పరిశోధనల ప్రకారం, వైరస్ సోకిన తొలి నాళ్లలోనే రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతున్న విషయాన్ని నోరు మరియు నాలుకపై కనిపించే మార్పుల ద్వారా గుర్తించవచ్చు. అమెరికా ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం, హెచ్‌ఐవితో జీవిస్తున్న వారిలో మూడో వంతు మంది తీవ్రమైన నోటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. శరీరంలో వైరస్ విస్తరిస్తున్నప్పుడు నోటిలో కనిపించే ప్రధాన సంకేతాలు, ఇతర లక్షణాలు:

నోటిలో కనిపించే హెచ్చరిక సంకేతాలు

ఓరల్ థ్రష్: నాలుకపై లేదా అంగిలిపై మందపాటి తెల్లటి పూతలా ఏర్పడుతుంది. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ క్రమంగా గొంతుకు వ్యాపించడమే కాకుండా, పెదవుల మూలల్లో పగుళ్లు, వాపును కలిగిస్తుంది.

నోరు పొడిబారడం : లాలాజల గ్రంథుల పనితీరు తగ్గి తగినంత లాలాజలం ఉత్పత్తి కాదు. దీనివల్ల ఆహారం మింగడం కష్టతరంగా మారుతుంది.

నోటి పుండ్లు: దవడల లోపలి భాగంలో, నాలుక కింద తరచుగా మానని చిన్న లేదా పెద్ద పుండ్లు కనిపిస్తాయి.

తీవ్రమైన చిగుళ్ల సమస్యలు, దంతక్షయం: చిగుళ్ల నుంచి రక్తం కారడం, తీవ్రమైన వాపు రావడం, దంతాలు వదులవ్వడం వంటివి జరుగుతాయి. ఇన్ఫెక్షన్ సోకిన 18 నెలలలోపే దంతాలు దెబ్బతినడం మొదలవుతుంది. ధూమపానం చేసేవారిలో ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది.

క్యాపోసిస్ సార్కోమా: అంగిలి పైన లేదా నాలుక వెనుక భాగంలో ముదురు ఊదా (పర్పుల్) లేదా ఎరుపు రంగు మచ్చలు/కణితులు ఏర్పడతాయి. ఇది తీవ్రమైన రోగనిరోధక లోపానికి బలమైన సంకేతం.

పురుషుల్లో కనిపించే ఇతర ముందస్తు సంకేతాలు

ఫ్లూ తరహా లక్షణాలు: కారణం లేకుండా తరచూ జ్వరం రావడం, గొంతునొప్పి, తీవ్రమైన నీరసం, అలసట.

రాత్రి వేళల్లో చెమటలు: చల్లని వాతావరణంలోనూ రాత్రిపూట విపరీతంగా చెమట పట్టడం.

చర్మ సమస్యలు: శరీరం లేదా జననాంగాలపై దురదతో కూడిన దద్దుర్లు రావడం.

పురుషుల సమస్యలు: ప్రోస్టేట్ గ్రంథి వాపు రావడం, స్ఖలనం సమయంలో నొప్పి లేదా తీవ్ర ఇబ్బంది కలగడం, అంగస్తంభన లోపం ఏర్పడటం.

శ్వాసకోశ, బరువు సమస్యలు: ఆహారంలో మార్పులు లేకపోయినా వేగంగా బరువు తగ్గడం, దీర్ఘకాలిక దగ్గు, శ్వాస తీసుకోవడంలో తీవ్ర శ్రమ.

మానసిక మార్పులు: చిన్న విషయాలకే గందరగోళం, అధిక చిరాకు, డిప్రెషన్ మరియు జ్ఞాపకశక్తి క్షీణించడం.

Tags: