Diabetes Patients: షుగర్ పేషెంట్లు జర భద్రం.. లైట్ తీసుకుంటే పాదాలకే ప్రమాదం..
పాదాలకే ప్రమాదం..
Diabetes Patients: డయాబెటిస్ ఉన్నవారిలో చిన్న చిన్న దెబ్బలు లేదా కోతలు కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలు దీర్ఘకాలంగా ఎక్కువగా ఉన్నప్పుడు నరాలు, రక్తనాళాలు దెబ్బతింటాయి. దీనివల్ల పాదాలలో స్పర్శ తగ్గిపోయి, గాయమైనా లేదా బొబ్బలు వచ్చినా నొప్పి తెలియకపోవచ్చు. సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే ఈ చిన్న గాయాలు కాస్తా పెద్ద పుండ్లుగా మారే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రమాదకరమైన హెచ్చరిక సంకేతాలు
పాదాల అడుగు భాగం, కాలి వేళ్ల సందులు, మడమల వద్ద గాయాలు అయ్యే అవకాశం ఎక్కువ. కింది లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాలి.
పాదంపై చిన్న ఎర్రటి మచ్చలు, బొబ్బలు లేదా రాపిడి గాయాలు
గాయం చుట్టూ వాపు, చర్మం రంగు మారడం
గాయం నుంచి చీము కారడం లేదా దుర్వాసన రావడం
గాయంతో పాటు జ్వరం లేదా చలి ఉండటం.
మధుమేహంలో గాయాలు త్వరగా ఎందుకు మానవు?
రక్త ప్రసరణ తగ్గడం: రక్తనాళాలు దెబ్బతినడం వల్ల పాదాలకు సరైన రక్త ప్రసరణ జరగదు, దీంతో కణజాలం వేగంగా కోలుకోదు.
రోగనిరోధక శక్తి తగ్గడం: అధిక బ్లడ్ షుగర్ లెవెల్స్ వల్ల శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యం తగ్గి, బ్యాక్టీరియా వేగంగా విస్తరిస్తుంది.
స్పర్శ కోల్పోవడం (న్యూరోపతి): గాయం పెద్దదయ్యేంత వరకు రోగికి నొప్పి తెలియకపోవడమే ఆలస్యానికి ప్రధాన కారణం.
తీసుకోవాల్సిన రోజువారీ జాగ్రత్తలు
రోజూ పాదాలను తనిఖీ చేయండి: పాదాల అడుగు భాగం, వేళ్ల మధ్య ఎరుపు, పగుళ్లు లేదా గాయాలు ఉన్నాయేమో ప్రతిరోజూ అద్దం సహాయంతో చూసుకోవాలి.
పరిశుభ్రత - పొడిదనం: పాదాలను గోరువెచ్చని నీటితో కడిగి, ముఖ్యంగా వేళ్ల సందుల్లో తేమ లేకుండా మెత్తని గుడ్డతో పూర్తిగా ఆరబెట్టుకోవాలి.
పాదరక్షల ఎంపిక: ఇంట్లోనైనా చెప్పులు లేకుండా నడవకూడదు. కాలికి సరిగ్గా సరిపోయే, మెత్తటి కుషన్ ఉన్న బూట్లు లేదా డయాబెటిక్ పాదరక్షలు ధరించాలి.
గోళ్ల కత్తిరింపు: గోళ్లను చర్మం తెగేలా కాకుండా చాలా జాగ్రత్తగా, నిలువుగా కత్తిరించుకోవాలి.
బ్లడ్ షుగర్ నియంత్రణే కీలకం
పాదాల ఆరోగ్యం బాగుండాలంటే రక్తంలో చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు అదుపులో ఉంచుకోవాలి. సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, తగినంత నీరు తాగడం ముఖ్యం. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. పాదంలో ఏదైనా పుండు ఏర్పడితే సొంత వైద్యం చేసుకోకుండా, వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.