Eating Fennel Seeds After Meals: భోజనం తర్వాత సోంపు తింటున్నారా? అయితే మంచిదో.. నకిలీదో ఇలా గుర్తించండి..
అయితే మంచిదో.. నకిలీదో ఇలా గుర్తించండి..
Eating Fennel Seeds After Meals: మన భారతీయ సంస్కృతిలో భోజనం తర్వాత సోంపు తినడం అనేది ఒక ఆచారం. జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా నోటిని తాజాగా ఉంచే నేచురల్ మౌత్ ఫ్రెషనర్‌గా దీనికి పేరుంది. అయితే మీరు అమృతం అని తింటున్న ఈ సోంపు.. రసాయనాలతో నిండిన విషంగా మారుతోందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఏకంగా 900 కిలోల కల్తీ సోంపును అధికారులు స్వాధీనం చేసుకోవడం సంచలనం సృష్టించింది.
ఎందుకు కల్తీ చేస్తున్నారు?
పాతబడిపోయిన, రంగు వెలిసిపోయిన లేదా చెడిపోయిన సోంపు గింజలకు కృత్రిమ ఆకుపచ్చ రంగును పులిమి అవి తాజాగా ఉన్నట్లు భ్రమింపజేస్తున్నారు. అలాగే సోంపు బరువును పెంచడానికి హానికరమైన రసాయనాలను కూడా జోడిస్తున్నారు. ఇవి మన కడుపులోకి చేరితే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
కల్తీ సోంపును గుర్తించడం ఎలా?
మీ ఇంట్లో ఉన్న సోంపు స్వచ్ఛమైనదో కాదో తెలుసుకోవడానికి ఈ చిట్కాలు పాటించండి:
అరచేతితో పరీక్ష: కొద్దిగా సోంపును తీసుకుని మీ అరచేతిలో వేసి గట్టిగా రుద్దండి. ఒకవేళ మీ చేతికి ఆకుపచ్చ రంగు అంటుకుంటే, అందులో కృత్రిమ రంగులు కలిపారని అర్థం. కొద్దిగా నీటి చుక్కలు వేసి రుద్దితే కల్తీని ఇంకా సులభంగా పసిగట్టవచ్చు.
నీటి పరీక్ష: ఒక గ్లాసు నీటిలో చెంచా సోంపు గింజలు వేయండి. వేసిన వెంటనే నీరు ముదురు ఆకుపచ్చ రంగులోకి మారితే అది కచ్చితంగా కల్తీ సోంపే. సహజమైన సోంపు రంగు నీటిలో చాలా నెమ్మదిగా కలుస్తుంది.
రంగును గమనించండి: ప్రకృతి సిద్ధమైన సోంపు లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. కానీ, మీరు కొన్న సోంపు మరీ ప్రకాశవంతంగా లేదా డార్క్ గ్రీన్ కలర్‌లో మెరిసిపోతుంటే అది రసాయనాల ప్రభావమే అని అనుమానించాలి.
రుచి - వాసన: కొన్ని గింజలను నమిలి చూడండి. రుచి చేదుగా ఉన్నా, అసాధారణమైన తీపి అనిపించినా లేదా వింత వాసన వస్తున్నా ఆ సోంపు కల్తీ అని గుర్తుంచుకోండి.
అతిగా తింటే ప్రమాదమే!
సోంపు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, కల్తీ జరిగిన ఈ రోజుల్లో దానిని పరిమితికి మించి తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లలో ఇచ్చే రంగురంగుల సోంపు పట్ల అప్రమత్తంగా ఉండాలి.
ఆరోగ్యం కోసం వాడే సోంపు ప్రాణాల మీదకు తీసుకురాకూడదంటే, కొనుగోలు చేసేటప్పుడు నాణ్యతను తనిఖీ చేయడం మర్చిపోకండి. వీలైతే ఆర్గానిక్ సోంపును ఎంచుకోవడం ఉత్తమం.