Gained Weight Suddenly: శరీర బరువు అకస్మాత్తుగా పెరిగిపోయిందా? అయితే అది కొవ్వు పెరగడం వల్ల మాత్రమే కాకపోవచ్చు. శరీరంలో అదనంగా నీరు లేదా ద్రవాలు చేరడం వల్ల కూడా ఒక్కసారిగా బరువు పెరిగినట్లు కనిపిస్తుంది. వైద్య పరిభాషలో దీనిని వాటర్ వెయిట్ లేదా ఫ్లూయిడ్ రిటెన్షన్ అంటారు. ఈ సమస్య తలెత్తినప్పుడు కడుపు ఉబ్బరంగా అనిపించడం, చేతులు, కాళ్ళలో వాపులు రావడం, ముఖం ఉబ్బినట్లు కనిపించడం వంటి లక్షణాలు బయటపడతాయి. అధికంగా ఉప్పు తీసుకోవడం, గంటల తరబడి ఒకేచోట కూర్చోవడం, హార్మోన్ల అసమతుల్యత, కొన్ని మందుల వాడకం వల్ల శరీరంలో నీరు నిలిచిపోతుంది. కొన్ని సందర్భాల్లో గుండె, మూత్రపిండాలు లేదా కాలేయ సమస్యలు ఉన్నా ఈ లక్షణం కనిపించవచ్చు. ఈ వాటర్ వెయిట్ సమస్యను సులభంగా అదుపులో ఉంచుకోవడానికి ఆరోగ్య నిపుణులు సూచిస్తున్న 5 చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

సరిపడా నీరు తాగడం ముఖ్యం

శరీరంలో నీరు నిలిచిపోయింది కదా అని నీళ్లు తాగడం పూర్తిగా తగ్గించకూడదు. శరీరం డీహైడ్రేషన్‌కు గురైతే మరింత ఎక్కువ నీటిని నిల్వ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అందుకే వాతావరణం, శారీరక శ్రమకు తగినంతగా రోజూ మంచి నీరు తాగాలి. (అయితే, గుండె లేదా కిడ్నీ సమస్యల వల్ల వైద్యులు నీటి వినియోగానికి పరిమితులు విధిస్తే వారి సూచనలనే పాటించాలి).

ఆహారంలో ఉప్పు తగ్గించండి

శరీరంలో ద్రవాలు పేరుకుపోవడానికి ప్రధాన కారణం అధిక సోడియం. ఉప్పు ఎక్కువగా ఉండే పచ్చళ్ళు, ప్యాక్ చేసిన స్నాక్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకుంటూ సమతుల్య ఆహారాన్ని అలవాటు చేసుకోవాలి.

క్రమం తప్పకుండా వ్యాయామం

రోజూ వాకింగ్ లేదా ఇతర తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇది కణజాలాలలో నిలిచిపోయిన అదనపు ద్రవాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఎక్కువసేపు డెస్క్ వద్ద కూర్చుని పనిచేసే ఉద్యోగులు ప్రతి గంటకోసారి లేచి కాసేపు నడవడం మంచిది.

పొటాషియం పుష్కలంగా ఉండే ఆహారాలు

శరీరంలోని సోడియం శాతాన్ని సమతుల్యం చేయడంలో పొటాషియం కీలకపాత్ర పోషిస్తుంది. అరటిపండ్లు, ఆకుకూరలు, ఇతర తాజా కూరగాయలలో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. (గమనిక: కిడ్నీ సమస్యలు ఉన్నవారు పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి).

శరీరానికి సరైన విశ్రాంతి

రోజూ నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఎక్కువసేపు ఒకే భంగిమలో (ఒకే పొజిషన్‌లో) కూర్చోవడం లేదా నిలబడటం నివారించాలి. కాళ్లు, చేతుల్లో వాపులు ఉన్నప్పుడు తగినంత విశ్రాంతి ఇవ్వడం అవసరం.

వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి?

కాళ్లు, పాదాలు లేదా ముఖంలో వాపులు నిరంతరం కొనసాగుతున్నా, వాపుతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఛాతీ నొప్పి వంటి సమస్యలు ఎదురైనా ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. అలాగే వాటర్ వెయిట్ తగ్గడం అంటే శరీరంలోని కొవ్వు తగ్గినట్లు కాదని, సరైన జీవనశైలితోనే ఆరోగ్యకరమైన బరువును సాధించవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Tags: