Herpes Zoster Risk: సర్పి అనేది సాధారణంగా చల్ది అని కూడా పిలవబడే ఒక తీవ్రమైన చర్మ సమస్య. దీని ప్రధాన లక్షణం చర్మం నిప్పు కణికల మీద పెట్టినట్టుగా మండే భావనతో పాటు ద్రవంతో నిండిన పొక్కులు. పగవారికి కూడా ఇది రాకూడదని అనుకునేంత తీవ్రమైనది ఇది. వైద్యపరంగా దీన్ని హెర్పీస్ జోస్టర్ అంటారు.

ఈ సమస్యకు మూలం ఆటలమ్మ (చికెన్ పాక్స్) కు కారణమయ్యే వారిసెల్లా జోస్టర్ వైరస్. ఆటలమ్మ తగ్గిన తర్వాత ఈ వైరస్ శరీరం నుంచి పూర్తిగా వెళ్లిపోదు. అది నాడీ కణజాలంలో, ముఖ్యంగా స్పైనల్ నాడులు లేదా క్రానియల్ నాడుల గ్యాంగ్లియాలో నిద్రాణ స్థితిలో దాగి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇది దశాబ్దాల తరబడి అలాగే ఉంటుంది.

రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు ఈ నిద్రాణ వైరస్ మళ్లీ ఉత్తేజితమవుతుంది. అప్పుడు అది నాడుల వెంట చర్మం వైపు ప్రయాణించి దద్దు, పొక్కుల రూపంలో కనిపిస్తుంది. వయసు పెరిగేకొద్దీ, ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన తర్వాత ఈ ముప్పు బాగా పెరుగుతుంది. మధుమేహం, క్యాన్సర్ చికిత్సలు, కీమోథెరపీ, రోగనిరోధక శక్తిని అణచిపెట్టే మందులు వాడే వారిలో కూడా ఇది సులభంగా వస్తుంది.

మొదట్లో కొన్ని రోజుల వరకు ఎలాంటి దద్దూ కనిపించదు. అలసట, తేలికపాటి జ్వరం, తలనొప్పి, శరీరం నొప్పులు ఉంటాయి. ఆ తర్వాత ఒకవైపు శరీరంలో నొప్పి, మంట, సూదులు పొడుస్తున్న భావన, దురద వస్తాయి. ఈ లక్షణాలు ఇతర సమస్యలుగా పొరపడేందుకు అవకాశం ఉంటుంది. ఒకటి నుంచి ఐదు రోజుల తర్వాత దద్దు మొదలవుతుంది. తర్వాత ద్రవంతో నిండిన పొక్కులు ఏర్పడతాయి.

పొక్కులు సాధారణంగా శరీరం ఒకవైపునే కనిపిస్తాయి. ఛాతీ, కడుపు భాగాల్లో ఎక్కువగా వస్తాయి. కొందరిలో ముఖం, మెడ, ఇతర భాగాల్లో కూడా రావచ్చు. నుదురు, కనుబొమలు, ముక్కు మీద దద్దు వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే అది కంటి చూపును దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది.

దద్దు, పొక్కులను గోకకూడదు. గోకితే బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎరుపు, వాపు, చీము కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. సాధారణంగా రెండు నుంచి నాలుగు వారాల్లో పొక్కులు ఎండిపోయి పక్కు కడతాయి. పక్కు కట్టే వరకు దద్దును కప్పి ఉంచాలి. చేతులను తరచూ శుభ్రంగా కడుక్కోవాలి.

గర్భిణులు, చిన్న పిల్లలు, రోగనిరోధక శక్తి తగ్గిన వారి దగ్గరకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే పొక్కుల ద్రవం ద్వారా వైరస్ ఇతరులకు చికెన్ పాక్స్‌గా వ్యాపించే అవకాశం ఉంటుంది. సర్పి అంటుకోదు, కానీ చికెన్ పాక్స్ అంటుకోవచ్చు.

కొందరిలో సర్పి తగ్గిన తర్వాత కూడా నెలల తరబడి నొప్పి ఉండిపోతుంది. దీన్ని పోస్ట్ హెర్పెటిక్ న్యూరల్జియా అంటారు. ఇది చాలా బాధాకరమైనది. అందుకే ముందస్తు చికిత్స చాలా ముఖ్యం. వైరస్‌ను అణచివేసే మందులు మొదటి రోజుల్లోనే మొదలు పెట్టాలి.

వయసు 50 దాటిన వారు, మధుమేహం ఉన్నవారు, రోగనిరోధక శక్తి తగ్గినవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. టీకా ద్వారా ఈ ముప్పును తగ్గించుకోవచ్చు. సర్పి వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకోవడం, ఆహారంలో పోషకాలు తీసుకోవడం, నొప్పి నియంత్రణ చేయడం అవసరం. ఏదైనా అనుమానం ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

Tags: