Black Coffee vs Black Tea: బ్లాక్ టీ కంటే బ్లాక్ కాఫీనే ఆరోగ్యానికి మంచిదా? నిపుణులు ఏమంటున్నారంటే..
నిపుణులు ఏమంటున్నారంటే..;
Black Coffee vs Black Tea: ఉదయం లేవగానే ఒక కప్పు టీ లేదా కాఫీ తాగడం చాలామందికి అలవాటు. అయితే బ్లాక్ టీ, బ్లాక్ కాఫీలలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మంచిదనే చర్చ ఎప్పుడూ ఉంటుంది. సాధారణంగా టీ, కాఫీలు రెండూ మంచివే అయినా.. కొన్ని ఆరోగ్య ప్రయోజనాల విషయంలో బ్లాక్ కాఫీ ముందంజలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రెండింటి మధ్య తేడాలు, ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.
కెఫీన్ స్థాయిలు
బ్లాక్ కాఫీ: ఒక కప్పు బ్లాక్ కాఫీలో దాదాపు 95 మిల్లీగ్రాముల కెఫీన్ ఉంటుంది. ఇది తక్షణమే శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. ముఖ్యంగా ఉదయం పూట లేదా పని సమయంలో ఏకాగ్రత పెరగడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
బ్లాక్ టీ: ఒక కప్పు బ్లాక్ టీలో 26-48 మిల్లీగ్రాముల కెఫీన్ మాత్రమే ఉంటుంది. ఇది బ్లాక్ కాఫీతో పోలిస్తే చాలా తక్కువ.
బరువు తగ్గడానికి..
కాఫీలో చక్కెర లేదా పాలు కలుపకుండా బ్లాక్ కాఫీ తాగితే బరువు తగ్గడానికి ఇది బాగా పనిచేస్తుంది. బ్లాక్ కాఫీ జీవక్రియను మెరుగుపరుస్తుంది. బ్లాక్ టీలో సహజంగా కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ, పాలు, చక్కెర లేదా తేనె కలపడం వల్ల కేలరీలు పెరుగుతాయి.
యాంటీఆక్సిడెంట్లు
బ్లాక్ కాఫీ: ఇందులో క్లోరోజెనిక్ యాసిడ్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వాపును తగ్గించడంలో సహాయపడతాయి. మధుమేహం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.
బ్లాక్ టీ: ఇందులో కూడా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే, కాఫీలోని పాలీఫెనాల్స్ దీని ఆరోగ్య రక్షణలో మరింత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
మెదడు పనితీరుపై ప్రభావం
జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచే సామర్థ్యం బ్లాక్ కాఫీకి ఎక్కువ. క్రమం తప్పకుండా బ్లాక్ కాఫీ తాగడం వల్ల అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. బ్లాక్ టీలో ఈ సామర్థ్యం ఉన్నప్పటికీ, తక్కువ కెఫీన్ కారణంగా దీని ప్రభావం తక్షణమే కనిపించదు.
శారీరక శ్రమకు శక్తి
వ్యాయామం చేయడానికి ముందు బ్లాక్ కాఫీ తాగడం వల్ల శారీరక పనితీరు మెరుగుపడుతుంది. ఇది శరీరంలోని కొవ్వును కరిగించి, వ్యాయామానికి అవసరమైన శక్తిగా మార్చే అడ్రినలిన్ స్థాయిని పెంచుతుంది. అయితే, బ్లాక్ టీ హైడ్రేషన్‌కు సహాయపడినప్పటికీ శారీరక పనితీరును మెరుగుపరిచే విషయంలో అంతగా ప్రభావం చూపదు.
ఈ అంశాలను పరిశీలిస్తే, బ్లాక్ కాఫీ ఆరోగ్యానికి కొన్ని అదనపు ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.