Plastic in the Water You Drink and the Salt You Eat: మీరు తాగే నీరు, తినే ఉప్పులో ప్లాస్టిక్ ఉందా..? మైక్రోప్లాస్టిక్స్‌తో పొంచి ఉన్న ముప్పు ఇదే..

మైక్రోప్లాస్టిక్స్‌తో పొంచి ఉన్న ముప్పు ఇదే..

Update: 2026-01-09 13:30 GMT

Plastic in the Water You Drink and the Salt You Eat: మనం ప్లాస్టిక్ కవర్లు, సీసాల వాడకాన్ని తగ్గిస్తే భారతదేశం ప్లాస్టిక్ రహితంగా మారుతుందని అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్లే. మనకు తెలియకుండానే మైక్రోప్లాస్టిక్స్ రూపంలో ప్లాస్టిక్ మన రక్తంలోకి, కణజాలాల్లోకి ప్రవేశిస్తోంది. మనం రోజూ వాడే ఉప్పు నుండి తాగే నీటి వరకు ప్రతిచోటా ఈ ప్రమాదకర కణాలు వ్యాపించి ఉన్నాయని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.

అసలు మైక్రోప్లాస్టిక్స్ అంటే ఏమిటి?

5 మిల్లీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉండే అతి సూక్ష్మ ప్లాస్టిక్ కణాలను మైక్రోప్లాస్టిక్స్ అంటారు. పారిశ్రామిక వ్యర్థాలు సముద్రాల్లో కలవడం, ప్లాస్టిక్ ప్యాకెట్లలో ఆహారాన్ని నిల్వ చేయడం వల్ల ఇవి ఆహార గొలుసులో చేరుతున్నాయి. ముఖ్యంగా ప్యాక్ చేసిన ఆహార పదార్థాల్లో వీటి సాంద్రత ఎక్కువగా ఉంటోంది.

మన ఆహారంలోకి ఇవి ఎలా వస్తున్నాయి?

సముద్రపు ఆహారం

చేపలు, రొయ్యలు ఇష్టపడే వారు జాగ్రత్తగా ఉండాలి. సముద్రపు నీటిలోని ప్లాస్టిక్ కణాలను రొయ్యలు వంటి జీవులు ఎక్కువగా గ్రహిస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, చిన్న చేపల కంటే పెద్ద చేపలను ఎంచుకోవడం కొంత వరకు సురక్షితం.

వంట ఉప్పులో ప్లాస్టిక్

మనం వంటల్లో వాడే సముద్రపు ఉప్పులో ఈ కణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా బాగా శుద్ధి చేసిన లేదా అయోడైజ్డ్ ఉప్పును వాడటం మంచిది. వీలైతే సహజ పద్ధతుల్లో తయారైన ఉప్పుకు ప్రాధాన్యత ఇవ్వండి.

ప్లాస్టిక్ బాటిల్ నీరు

ప్రయాణాల్లో మనం కొనే ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లలో మైక్రోప్లాస్టిక్స్ నీటితో కలిసిపోతాయి. దీనికి బదులుగా స్టెయిన్‌లెస్ స్టీల్ లేదా రాగి బాటిళ్లను వాడండి. ఇంట్లో మట్టి కుండలను ఉపయోగించడం ఉత్తమం. నీటిని కార్బన్ లేదా UF ఫిల్టర్ల ద్వారా శుద్ధి చేసి తాగండి.

తేనె - టీ బ్యాగులు

ప్లాస్టిక్ డబ్బాల్లో ప్యాక్ చేసే తేనెలోకి సూక్ష్మ కణాలు చేరే అవకాశం ఉంది. కాబట్టి ఎల్లప్పుడూ గాజు సీసాల్లో లభించే తేనెనే కొనండి. అలాగే, నైలాన్ లేదా ప్లాస్టిక్ మిశ్రమంతో చేసే టీ బ్యాగులను వేడి నీటిలో ముంచినప్పుడు లక్షలాది మైక్రోప్లాస్టిక్స్ మీ కప్పులోకి విడుదలవుతాయి. టీ బ్యాగులకు బదులు నేరుగా టీ పొడిని వాడటం సురక్షితం.

ఈ ప్రమాదాన్ని ఎలా నివారించాలి?

ఆహార పదార్థాలను ప్లాస్టిక్ కంటైనర్లలో కాకుండా గాజు లేదా స్టీల్ పాత్రలలో నిల్వ చేయండి.

మైక్రోవేవ్ ఓవెన్లలో ప్లాస్టిక్ పాత్రలను అస్సలు వాడకండి.

ప్యాక్ చేసిన జంక్ ఫుడ్ వాడకాన్ని తగ్గించండి.

మైక్రోప్లాస్టిక్స్ సమస్య కేవలం పర్యావరణానికే కాదు, మన ప్రాణాలకే ముప్పుగా మారుతోంది. ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సైలెంట్ కిల్లర్ నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

Tags:    

Similar News