Kidneys at Risk: వర్షాకాలం వచ్చేసింది.. ఈ తప్పు చేస్తే మీ కిడ్నీలు డేంజర్ లో పడ్డట్టే!
డేంజర్ లో పడ్డట్టే!
Kidneys at Risk: వర్షాకాలం వస్తే చాలు.. వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. చల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ వేడి వేడి పకోడీలు లాగించేస్తుంటాం. కానీ, ఈ సీజన్ మన కిడ్నీలకు, యూరినరీ వ్యవస్థకు ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా? డాక్టర్లు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా ఎండాకాలంలో చెమట ఎక్కువగా వస్తుంది కాబట్టి, మనం విపరీతంగా నీళ్లు తాగుతాం. కానీ వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల దాహం తక్కువగా వేస్తుంది. దీనివల్ల చాలామంది నీరు తాగడం బాగా తగ్గించేస్తారు. అయితే, శరీరానికి తగినంత నీరు అందకపోతే జరిగే నష్టం పెద్దదే అంటున్నారరు నిపుణులు.
వర్షాకాలంలో తక్కువ నీరు తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు (Kidney Stones), మూత్రనాళ ఇన్ఫెక్షన్లు (UTI) వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. మనం తగినన్ని నీళ్లు తాగకపోవడం వల్ల మూత్రం ద్వారా బయటకుపోవాల్సిన మలినాలు పేరుకుపోయి, బ్యాక్టీరియా పెరిగేందుకు దారితీస్తుంది.
కిడ్నీలో రాళ్లు లేదా యూటీఐ సమస్య తలెత్తితే శరీరం కొన్ని లక్షణాలను ఇస్తుంది. అవేంటంటే.
వీపు లేదా పక్క భాగంలో తీవ్రమైన నొప్పి
మూత్ర విసర్జన సమయంలో మంట లేదా విపరీతమైన నొప్పి
తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం
మూత్రంలో దుర్వాసన లేదా రక్త పడటం
అలాగే జ్వరం, చలి, వికారం వంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
మరి ఈ సమస్యల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? డాక్టర్లు చెబుతున్న సింపుల్ టిప్స్ ఇవే
వాతావరణం ఎలా ఉన్నా.. రోజుకు కనీసం 2 నుంచి 3 లీటర్ల శుభ్రమైన నీటిని విధిగా తాగాలి.
ఎట్టి పరిస్థితుల్లోనూ మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోకూడదు.
వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు, కాటన్ లోదుస్తులను ధరించడం మంచిది.
జంక్ ఫుడ్, కలుషిత నీరు, ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. తాజా పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి.
చల్లగా ఉంది కదా అని నీళ్లు తాగడం తగ్గించకండి. సరైన నీటి అలవాట్లతోనే మీ కిడ్నీలను ఆరోగ్యంగా కాపాడుకోండి!